
గోరంట్ల బుచ్చయ్య చౌదరీ…..తెలుగుదేశం స్థాపించిన దగ్గర నుంచి, జెండాని మోస్తున్న నాయకుడు. అంటే చంద్రబాబు కంటే ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేత. నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు సడన్‌గా పార్టీని వదిలేయాలని ఫిక్స్ అయ్యారు…పార్టీనే కాదు ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని బుచ్చయ్య భావిస్తున్నారు. మరి ఇంతలా బుచ్చయ్య ఆవేదన చెందుతుంది…ఏమన్నా పదవుల కోసమా? అంటే కాదనే చెప్పాలి

సాధారణంగా నాయకులు పదవులు కోసం నాయకులు అలకపాన్పు ఎక్కుతారు. అవసరమైతే పార్టీలు మారిపోతారు. కానీ బుచ్చయ్య అలిగింది…పార్టీని బాగుచేయడానికి అని తెలుస్తోంది. ఇప్పుడు బుచ్చయ్య అంశమే టీడీపీలో హాట్ టాపిక్ అయింది. పార్టీలో కార్పొరేట్ స్థాయి రాజకీయం జరుగుతుందని, కింది స్థాయి కార్యకర్తలకు న్యాయం జరగడం లేదనేది బుచ్చయ్య ఆవేదన.ముఖ్యంగా పలుమార్లు రాజమండ్రి సిటీ నుంచి గెలిచిన బుచ్చయ్యని 2014 ఎన్నికల్లో రూరల్‌కు పంపించారు. ఇక్కడ నుంచి పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేదు. కానీ అధిష్టానం చెప్పడంతో ఒకటి కాదు రెండు సార్లు పోటీ చేసి గెలిచారు. ఇక సిటీని ఆదిరెడ్డి ఫ్యామిలీకి వదిలేశారు. అలా అని అక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదనే బుచ్చయ్య అంటున్నారు. కాకపోతే అక్కడ మొదట నుంచి ఉన్న కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, వారికి న్యాయం చేయమంటే అధిష్టానం పట్టించుకోవడం లేదని, చంద్రబాబు, లోకేష్‌లు సైతం పట్టించుకోలేదని, అలాంటప్పుడు తాను పార్టీలో ఉంటే ఏం లాభమని మాట్లాడుతున్నారు.

వేరే పార్టీల నుంచి వచ్చే నాయకులని అందలం ఎక్కిస్తే, వారు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతున్నారని, కానీ ముందు నుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలే పార్టీకి అండగా ఉన్నారని, వారికి న్యాయం చేయకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక పరిణామాల నేపథ్యంలోనే బుచ్చయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ కోసం పడుతున్న బుచ్చయ్య ఆవేదనలో అర్ధం ఉందని కొందరు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.
Discussion about this post