టీడీపీకి కంచుకోటగా మారిన విజయవాడ రాజకీయాల్లో గ్రూపుల గోల మామూలుగా లేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చిత్తుగా ఓడిపోయినా బెజవాడలో మాత్రం తూర్పు సీటును భారీ మెజార్టీతో గెలుచుకుంది. అలాగే ఎంపీగా కేశినేని నాని వరుసగా రెండోసారి విజయం సాధించారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే బెజవాడలో పార్టీ పరువు కొంతైనా దక్కిందనే చెప్పాలి. అయితే ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే గెలిచినా ఆ ఆనందం లేకుండా పోయింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రాలు తిప్పిన నేతలు అందరూ ఎవరికి వారు ఆధిపత్య పోరుకు పోతుండడంతో పార్టీని సర్వనాశనం అయిపోయింది. గత కార్పొరేషన్ ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ పార్టీ మేయర్ పీఠం గెలుస్తుందని అనుకున్నారు. కట్ చేస్తే చేజేతులా కార్పొరేషన్‌ను పువ్వుల్లో పెట్టేసి వైసీపీకి అప్పగించేసింది.
ఎన్నికల సమయంలోనే ఎంపీ కేశినేని ఒంటెద్దు పోకడలకు పోవడం.. అటు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, షేక్ నాగుల్‌మీరా ముగ్గురు కలిసి ఎంపీని టార్గెట్ చేస్తూ ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్లే చాలా వరకు పార్టీని ఓడించేసింది. పార్టీలో ఉన్న విబేధాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సింది పోయి.. ఈ ముగ్గురు నేతలు ప్రెస్‌మీట్ పెట్టి నానిపై విమర్శలు చేయడంతో బెజవాడ ఓటర్లలో టీడీపీకి ఎందుకు ఓట్లేయడం అన్న భావన కల్పించింది. అప్పటి వరకు ఇక్కడ పోటాపోటీగా ఉన్న పోరు కాస్తా వైసీపీకి వన్‌సైడ్‌గా మారిపోయింది.
ఇక అదే ప్రెస్‌మీట్లో ఈ ముగ్గురు నేతలు సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకు రావడం కూడా పార్టీని మరింత డ్యామేజ్ చేసింది. ఇక కష్టకాలంలో గెలిచిన సిట్టింగ్ ఎంపీ ఉండగా.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని మరీ బుద్దా వెంకన్న ప్రచారం చేయడం కూడా మైనస్ అయ్యింది. ఇక నాని కూడా అందరిని కలుపుకుని పోకుండా వ్యవహరించడం కూడా మైనస్సే అని చెప్పాలి. ఇక గద్దె రామ్మోహన్ ఎవ్వరిని పట్టించు కోకుండా తన దారిన తాను వెళుతున్నారు. ఏదేమైనా అందరూ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమన్వయంతో లేకుండా వ్యవహరిస్తూ బెజవాడ టీడీపీకి విలన్లుగా మారారు. మరి వీరు ఎప్పటకి మారతారో ? పార్టీ ఎప్పుడు గాడిలో పడుతుందో ? చూడాలి.
Discussion about this post