కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీలో కొన్ని రోజులుగా ఒక గుసగుస వినిపిస్తోంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించి.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని.. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈయ న మంత్రి రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. బాంబు పేలినట్టుగా ఈ చర్చ తెరమీదికి రావడం గమనార్హం. మరి ఈ చర్చకు రీజనేంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే.. కొన్నాళ్లుగా ఈయనకు పార్టీలో కొందరు కీలక నేతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయని.. ఇవి పైస్థాయి వరకు వెళ్లాయని తెలుస్తోంది.
తనకు మంత్రి పదవి రాకుండా.. ఓ మంత్రి అడ్డు పడుతున్నారని.. వచ్చే కేబినెట్ కూర్పులో కనుక.. మంత్రి పదవి దక్కకపోతే.. అసలు రాజకీయాల నుంచే తప్పుకొంటానని.. కొలుసు అన్నట్టుగా మరో ప్రచారం తెరమీదికి వస్తోంది. అయితే.. ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఏమీ చెప్పకపోయినా.. తాను మంత్రి అవుతున్నానని.. కొలుసు ప్రచారం చేసుకుంటుండగా.. ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమని.. వచ్చే కేబినెట్ కూర్పులో అన్నీ యువనేతలకు రిజర్వ్ అయ్యాయని.. ఈ క్రమంలో జిల్లా నుంచి మరో నేతను తీసుకుంటారే తప్ప.. కొలుసుకు ఛాన్స్ ఇచ్చేది లేదని ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక తనను డ్యామేజీ చేసే కుట్ర ఉందని.. కొలుసు భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ దఫా.. మంత్రి పదవి తప్ప.. ఎలాంటి నామినేటెడ్ పదవి తనకు అవసరం లేదని ఆయన కుండ బద్దలు కొడుతున్నారు. గత కేబినెట్ కూర్పు తర్వాత.. కొలుసును శాంతింప జేసేందుకు.. ఆయనకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారు. అయితే.. ఆయన అయిష్టంగా దీనిని తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనను మరోసారి టీటీడీ బోర్డుకు పంపించేలా వ్యూహం రెడీ అవుతోందట.ఇదే కనుక జరిగితే.. మంత్రి పదవి దక్కదని కొలుసు వర్గం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆయనకు మంత్రి పదవి, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా కష్టమేనని మరో ప్రచారం సాగుతుండడం చూస్తే.. కొలుసు కేంద్రంగా.. వైసీపీలో పెద్ద రచ్చ సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.
Discussion about this post