దేవుడు దయ ఉంటే ప్రత్యేక హోదా వస్తుంది. మన చేతిలో ఏమీ లేదు అన్నట్లుగా ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. కేంద్రానికి పూర్తి మెజారిటీ ఉంది. అందువల్ల వారిని గట్టిగా అడగలేం అంటూ అసక్తతను వ్యక్తం చేశారు. మొత్తానికి రెండేళ్ల తరువాత జగన్ జనాలను మానసికంగా సిద్ధం చేయడానికి ఈ మాటలు వదిలారు అంటున్నారు. కేంద్రం ఎపుడో హోదా ఇవ్వలేమని చెప్పేసింది. అది చంద్రబాబు టైమ్ లోనే జరిగింది. అలా కేంద్రం కుండబద్ధలు కొట్టినా మాకు పాతిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని జగన్ నాడు ఊరూరా తిరిగి గట్టిగా చాటింపు వేశారు. జనాలు కూడా ఇదే నిజమని నమ్మి ఓటేశారు. ఆయన కోరినట్లుగానే 22 మంది ఎంపీలను ఇచ్చారు. తీరా ఇపుడు ఫ్లేట్ ఫిరాయించారు జగన్ అన్నదే అందరి ఆవేదనగా ఉంది.
ప్రతి విషయంలోనూ ఎన్నో మార్గాలు ఉంటాయి. వాటిని కచ్చితంగా అమలు చేస్తే డిమాండ్లు నెగ్గుతాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మోడీ సర్కార్ కి అసలు పడదు, పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాగని మమతా బెనర్జీ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా తగ్గుతున్నారా అన్నది ఇక్కడ ప్రశ్న.అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తన ప్రజల కోసం కేంద్రంతో ఎందాకైనా అన్నట్లుగానే పోరు సలుపుతున్నారు. ఇక ఈ మధ్యనే తమిళనాడు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ కూడా మోడీ సర్కార్ ని గట్టిగానే విమర్శిస్తారు మరి ఆయన తమిళనాడు ప్రయోజనాల కోసం పోరాడడం లేదా అన్న మాట ఉంది.అంటే ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉండాలి. అంతే కాదు మడమ తిప్పను అంటున్న జగన్ కి హోదా విషయంలో ఒక పట్టుదల ఉండాలని కూడా సూచిస్తున్నారు. బీజేపీకి ఈ రోజుకీ కూడా రాజ్య సభలో మెజారిటీ లేదు. రెండేళ్ళుగా రాజ్యసభలో వైసీపీ బేషరతుగానే మద్దతు ఇస్తోంది. ఆ విధంగా అనేక బిల్లులను నెగ్గించుకుంటోంది మోడీ సర్కార్. మరి ఎపుడైనా ప్రత్యేక హోదా ఇస్తేనే తప్ప మీ బిల్లులకు మద్దతు ఇవ్వను అని జగన్ గట్టిగా కేంద్రానికి చెప్పగలిగారా అన్న ప్రశ్న అయితే వస్తోంది. ఇక రానున్న రోజులలో కూడా వైసీపీ మద్దతు కేంద్రానికి అవసరం అవుతుంది.
వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. అదే ఏడాది రాజ్యసభలో బీజేపీకి ఎంపీలు తగ్గిపోతే వైసీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. అంటే పెద్దల సభలో నాలుగవ అతి పెద్ద పార్టీ. మరి కేంద్రాన్ని డిమాండ్ చేసి హోదా సాధించాలని అనుకుంటే ఇంతకు మించిన మార్గం ఉండదు. అలా చేయకుండా కేంద్రానికి మౌనంగా మద్దతు ఇస్తూ హోదా భారం దేవుడి మీద వేస్తే ఎలా జగన్ అంటున్నారు అంతా. మరి జగన్ మోడీ సర్కార్ మీద పోరాడగలరా.
Discussion about this post