“కలికాలం ఇదే కదా.. రెండేళ్ల కిందటి వరకు అసలు చీరాలను పట్టించుకోని నాయకుడు, గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచిన నాయకుడు, వ్యక్తిగత అవసరాల కోసం.. పార్టీమారిన నాయకుడు ఇప్పుడు తానే సుప్రీం అని ప్రకటించుకోవడమా? పరక్షంగా తనకు భజ న చేయించుకోవడమా!“ ఇదీ .. ఇప్పుడు ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వినిపిస్తున్న టాక్. అది కూడా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గురించే కావడం గమనార్హం. గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచిన ఆయన తనపై ఉన్న కేసులు కావొచ్చు.. లేదా అభివృధ్ది పేరిట కావొచ్చు.. ఆపార్టీకి దూరం జరిగి.. వైసీపీకి చేరువయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్టీలో తనదైన హవా ప్రదర్శిస్తున్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి కీలక నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై దూకుడుగా వ్యవహరించి.. ఏకంగా చీరాల మునిసిపాలిటీలో తన అభ్యర్థులను రంగంలోకి దింపారు. బీఫారాలు కూడా తెప్పించుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఫైర్ బ్రాండ్ యువ నాయకుడు ఆమంచి కూడా.. తనవ వర్గం వారిని రంగంలోకి దింపారు. వీరంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఈ క్రమంలో 11 మంది విజయం దక్కించుకున్నారు. అదే సమయంలో కరణం వర్గం వైసీపీ జెండా పై పోటీ చేసి.. 18 చోట్ల విజయం దక్కించుకుంది. ఆ వెంటనే ఆమంచి వర్గంగా ఉన్న 11 మంది కూడా జిల్లాకు చెందిన మంత్రి , ఒంగోలు ఎమ్మెల్యే, వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి.. వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.

దీంతో బాలినేని వారిని సాదరంగా ఆహ్వానించి.. పార్టీ కండువాలు కప్పారు. వీరంతా కూడా వైసీపీ కౌన్సెలర్లే అని బాలినేని స్వయంగా ప్రకటించారు.
దీంతో అందరూ కూడా కీలకంగానే మారారని.. పార్టీలోను.. మునిసిపల్ కౌన్సిల్‌లోనూ సమ ప్రాధాన్యం దక్కుతుందని అనుకున్నారు. కానీ, కరణం తెరవెనుక చక్రం తిప్పి.. మునిసిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులను తన వర్గం వారికే ఇప్పించుకున్నారు. అయినప్పటికీ.. ఆమంచి వర్గం సర్దుకుపోయింది. అయితే.. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో.. తమకు అన్యాయం చేస్తున్నారని.. తమ వార్డులను అభివృద్ధి చేయాలని కోరుతున్నా.. పట్టించుకోవడం లేదని.. ఆమంచి వర్గంగా ఉన్న 11 మంది నిలదీశారు. దీంతో కౌన్సిల్‌లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

ఈ క్రమంలో సర్ది చెప్పాల్సిన వైఎస్ చైర్మన్ జైసన్ బాబు.. బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయి. “మీరంతా బీరువా గుర్తుపై గెలిచారు. మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. అలా కాదు.. ఎమ్మెల్యే కరణం బలరాంను కలిసి.. ఆయన నుంచి ఆశీస్సులు తీసుకుంటేనే మీకు పనులు జరుగుతాయి“ అని బహిరంగంగానే తేల్చి చెప్పారు. అంటే.. జిల్లాకు కీలకంగా ఉన్న మంత్రి బాలినేని సమక్షంలో పార్టీలో చేరిన ఆ కౌన్సెలర్లకు విలువ లేదన్నమాట. అంతేకాదు.. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కరణమే ఇప్పుడు చీరాల రారాజు అయ్యారన్న మాట.. అనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు.. జైసన్ బాబు వైఖరి చూస్తే.. అసలు మంత్రి అంటే విలువ కూడా లేకుండా పోయిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

ఎవరు ఎలా ? గెలిచారనేది అందరికీ తెలిసిందేనని.. అయినప్పటికీ.. వారంతా కూడా వైసీపీ సభ్యులేనని.. ఇప్పుడు తమ వార్డులను అభివృద్ధి చేయాలని కోరితే.. వెళ్లి కరణం ఆశీస్సులు పొందాలని చెప్పడం ఏంటని.. 11 మంది సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి వాసుబాబు దగ్గరే తేల్చుకుంటామని కూడా వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తోంది. బాలినేని వాసు.. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2019లో విజయం దక్కించుకుని.. కేబినెట్‌లో సీటు పొందారు.

జగన్ దగ్గర కూడా ఆయనకు మంచి మార్కులు ఉన్నాయి. జిల్లా రాజకీయాలను ఇప్పుడు జగన్ బాలినేనికే అప్పగించారు. అలాంటి బాలినేనిని కాదని బలరాం సుప్రీం అన్నట్టుగా చీరాలలో బలరాం వర్గం చెపుతుండడం పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. బాలినేని సమక్షంలో చేరిన వారికి కూడా చేదు అనుభవం ఎదురవడం.. అంతా కరణమేనని పేర్కొనడం.. పార్టీని ధిక్కరించినట్టు కాదా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఏదేమైనా చీరాల వైసీపీ రాజకీయాలు మళ్లీ యూటర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Discussion about this post