విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం…అసలు తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గం. అసలు ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం మూడు సార్లు మాత్రమే. 1983, 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ గెలిచింది. ఇక అక్కడ నుంచి బొబ్బిలిలో టీడీపీ జెండా ఎగరలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో బొబ్బిలికోటలో టీడీపీ జెండా ఎగరనుందని తెలుస్తోంది. గతంలో మూడుసార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన శంబంగి చిన అప్పలనాయుడు ఇప్పుడు వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బొబ్బిలిలో గెలిచిన సుజయకృష్ణ రంగారావు, 2014లో వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి వచ్చి మంత్రిగా పనిచేశారు.

ఇక 2019 ఎన్నికల్లో సుజయ టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక సుజయ రాజకీయాల నుంచి సైడ్ అయ్యారు. దీంతో బొబ్బిలి బాధ్యతలని సుజయ సోదరుడు బేబీ నాయన చూసుకుంటున్నారు. తమ కంచుకోటని బేబీ నాయన తిరిగి దక్కించుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అటు బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే చినఅప్పలనాయుడు పూర్తిగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఈయనపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా వస్తున్న సర్వేల్లో కూడా అప్పలనాయుడుకు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బొబ్బిలిలో టీడీపీ గెలిచినంత పని చేసింది. రాష్ట్రంలో టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాల్టీ తాడిపత్రి తర్వాత ఇక్కడ టీడీపీ రెండో విజయం నమోదు చేసేదే. అయితే తృటిలో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక ఇప్పుడు బొబ్బిలిలో టీడీపీకి లీడింగ్ వచ్చేసినట్లు కనబడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన కూడా ఇక్కడ పసుపు జెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే 1994 తర్వాత ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పొచ్చు.
Discussion about this post