జగన్ కి కేంద్రం మద్దతు ఎంత అవసరమో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మీద సీబీఐ కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే పతనం అంచున ఆర్ధిక పరిస్థితి ఉంది. చంద్రబాబు ఓడిపోయినా వ్యవస్థలను బహు చక్కగా మ్యానేజ్ చేయడంలో దిట్ట. ఈ రోజుకీ ఆయన మనుషులు కీలకమైన విభాగాలలో ఉన్నారు. అయితే కేంద్రంలో మోడీ అండ ఉంది కాబట్టే జగన్ని ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. అంతవరకూ ఎందుకు జగన్ మీద సీబీఐ కేసుల విచారణ నెమ్మదించింది అన్న విమర్శలు ఉన్నాయి. అలాగే బెయిల్ రద్దు పిటిషన్ మీద సీబీఐ తన అభిప్రాయాన్ని ఈ రోజుకీ చెప్పలేదు.
ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా జగన్ని ఏమైనా చేయదలచుకున్నా ఇపుడు ఎవరి వల్ల కాదు అంటూ వార్తలు రాస్తూ నిరాశను వ్యక్తం చేస్తూ వస్తోంది. జగన్ కి పెద్దల అండ ఉందని, అందువల్ల ఆయనని కనీసం కదల్చడం సాధ్యం కాదు అన్న మాట ఉంది. మరి మోడీతో గొడవ పెట్టుకుంటే జగన్ మరుక్షణం ఎలాంటి ఇబ్బందులు పడతారో రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే ఊహించగలరు. కానీ ఇపుడు జగన్ ఎంపీలు పార్లమెంట్ లో తన గళం గట్టిగా వినిపిస్తారని అంటున్నారు.ఏపీ ప్రయోజనాల కోసం మేము పార్లమెంట్ లో ప్రశ్నిస్తామని లోక్ సభలో ఆ పార్టీ నాయకుడు మిధున్ రెడ్డి ప్రకటించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ సమస్య మీద కేంద్రంతో తేల్చుకుంటామని రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో అనేక తీరని ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా కేంద్రాని గట్టిగానే అడిగేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. నిజంగా ఇలా కేంద్రాన్ని ఎదిరించడం సాధ్యమేనా. అలా ఎదురొస్తే మోడీ కానీ అమిత్ షా కానీ ఊరుకుంటారా అన్నది కూదా ఒక ప్రశ్న.
ఇప్పటికే విపక్షాలు జాతీయ స్థాయిలో మోడీ మీద గుర్రుగా ఉన్నాయి. ఎపుడు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయా. ఎపుడు మోడీ సర్కార్ ని కడిగేద్దామని వారు ఎదురుచూస్తున్నారు. ఇపుడు వారితో పాటు మిత్రుడిగా ఉన్న వైసీపీ కూడా తిరగబడితే మోడీ తట్టుకుంటారా అన్నది చూడాలి. మొత్తానికి మోడీ జగన్ స్నేహానికి డెడ్ ఎండ్ కార్డ్ పడుతోందా. లేక ఇదేమైనా పక్కా రాజకీయ వ్యూహమా అన్నది కూడా చూడాలి.
Discussion about this post