ఏపీ ప్రజల్లో తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం చేసే తప్పిదాలపై బహిరంగంగానే ప్రజలు తిరగబడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు డైరక్ట్‌గా మాటల దాడికి దిగుతున్నారు. ఇటీవలే అమరావతిలో ఎమ్మెల్యే శ్రీదేవికి అక్కడి రైతులు, ప్రజలు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అలాగా బొబ్బిలిలో ఎమ్మెల్యే చిన అప్పలనాయుడుని ప్రజలు తరిమికొట్టారు. అసలైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, సొంత పార్టీ వాళ్లకే ఇవ్వడంతో బొబ్బిలిలోని ఒక గ్రామ ప్రజలు ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. జగనన్న కాలనీకి శంఖుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. ఇక ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా అవ్వలేదు.
ఈలోపే తనకు ధాన్యం డబ్బులు పడి మూడు నెలలు అయిపోయిందని చెప్పి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుని ఓ రైతు ప్రశ్నించారు. తాజాగా వైఎస్సార్ జయంతి సందర్భంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రైతు దినోత్సవం చేశారు. ఈ క్రమంలోనే తణుకులో కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఎమ్మెల్యే కారుమూరి ప్రసంగాన్ని ఓ రైతు అడ్డుకున్నారు. ధాన్యం అమ్మి మూడు నెలలు అయినా సరే ప్రభుత్వం ఇంకా డబ్బులు చెల్లించలేదని ప్రశ్నించారు. అటు ఎమ్మెల్యే సైతం, రైతుపై నోరు పారేసుకున్నారు. “నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా” అంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న రైతులు విస్తూపోయారు.
అసలు నెలల పాటు అప్పులు తెచ్చి కష్టపడి పండించిన పంట డబ్బులు వెంటనే ఇవ్వకపోగా, రైతుపైనే ఎమ్మెల్యే మాటల దాడి చేయడం సరికాదని అక్కడి ప్రజలు అంటున్నారు. గతంలో తక్కువ రోజుల్లోనే ధాన్యం డబ్బులు వచ్చేవని, ఇప్పుడు మూడు నెలల దాటిన డబ్బులు రావడం లేదని, రైతులకు డబ్బులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవం అని చేయడంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించే టైమ్ వచ్చేసిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
Discussion about this post