ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని అంశంపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు జగన్ ప్రభుత్వం వల్ల ఏపీకి రాజధాని ఏది అని వేరే రాష్ట్రం వాళ్ళు అడిగితే చెప్పలేని పరిస్తితుల్లో ఉన్నామని సామాన్య ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి వచ్చింది. కొత్తగా ఏర్పడిన ఏపీకి గత చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించింది. రాష్ట్రం మధ్యలో ఉందని, ప్రాంతాల మధ్య విభేదాల రాకుండా ఉండాలని తాము కూడా అమరావతికి మద్ధతు ఇస్తున్నామని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ సైతం ఒప్పుకున్నారు.

ఇక ఎన్నికల సమయంలో కూడా తాడేపల్లిలో ఇళ్ళు కట్టుకుని, రాజధాని అమరావతిలోనే ఉంటుందని హడావిడి చేశారు. కానీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక రాజధాని పేరుతో వైసీపీ ప్రభుత్వం రచ్చ లేపడం మొదలుపెట్టింది. అనూహ్యంగా మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు. ఉన్న అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించేశారు.

కానీ ప్రతిపక్ష టిడిపి, అమరావతి రైతులు మూడు రాజధానులని వ్యతిరేకించారు. అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని గత రెండేళ్ల నుంచి అమరావతి ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక వారిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నీ రకాలుగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంది. మూడు రాజధానులు చేసేస్తామని ఎప్పటికప్పుడు హడావిడిగా ప్రకటిస్తున్నారు గానీ, ఇంతవరకు మూడుకు దిక్కు లేకుండా పోయింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి రెండున్నర ఏళ్ల సమయం అయింది. మరో రెండున్నర ఏళ్లలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే సత్తా వైసీపీకి ఉన్నట్లు కనిపించడం లేదు.

పైగా రాజధాని అంశంపై క్లారిటీ లేక ప్రజలే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక కన్ఫ్యూజన్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావడం లేదు. ఒకవేళ మూడు రాజధానులు ఎలాగోలా ఏర్పాటు చేసినా కూడా, అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వీరి మూడు ముచ్చట తీరే సరికి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోతే ఇక మూడు కథ ముగిసినట్లే.

Discussion about this post