అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకు పెద్దగా పడటం లేదు. మొదట నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య రచ్చ జరుగుతుంది. కాకపోతే అది అంతర్గతంగా జరిగేది…కానీ తాజాగా ఆ రచ్చ మీడియా ముందుకొచ్చేసింది.

భరత్ ఎక్కువగా రాజా సొంత నియోజకవర్గం రాజానగరంలో ఎక్కువగా వేలు పెడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల అక్కడ ఓ దళిత లెక్చరర్‌పై దాడి జరిగింది. ఈ దాడి చేసింది రాజా అనుచరులే అని ఆ లెక్చరర్ ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో భరత్ అక్కడకు వెళ్ళి ఆ లెక్చరర్‌ని పరామర్శించారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని పోలీసులని ఆదేశించారు. దీంతో రాజాకు చిర్రెత్తుకొచ్చింది. భరత్ అక్రమాలని గతంలోనే రాజా ప్రశ్నించారు. అలాగే భరత్ ప్రత్యర్ధి పార్టీ నేతలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, రాజమండ్రిలో వైసీపీని నాశనం చేస్తున్నారని రాజా ఫైర్ అయ్యారు.

అటు భరత్ కూడా కౌంటర్లు ఇచ్చేశారు. ఎవరు చీకటి రాజకీయాలు చేస్తున్నారో తెలుసని మాట్లాడారు. ఇక ఈ రచ్చలోకి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వచ్చారు. భరత్ అక్రమాలు చేస్తున్నారని రాజా ఎప్పుడో ఆరోపిస్తే, వాటిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆవభూములు, పురుషోత్తపట్నం పథకం భూముల కుంభకోణంలో కోట్లు దోచుకున్నారని భరత్‌ని ఉద్దేశించి మాట్లాడారు.

అయితే ఆవ భూముల విషయంలో ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. కానీ దీనిపై జగన్ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. రాజా సైతం భరత్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇలా పార్టీలో ఇంత రచ్చ జరుగుతున్నా కూడా వైసీపీ పెద్దలు ఏ మాత్రం స్పందించడం లేదు.

Discussion about this post