చిత్తూరు జిల్లా..టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా. పేరుకే చంద్రబాబు సొంత జిల్లా గానీ, ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చాలావరకు తగ్గింది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ కేవలం ఒక కుప్పంలో మాత్రమే గెలిచింది. మిగిలిన అన్నీ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే ఓడిపోయాక పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు బాగానే పనిచేస్తున్నారు. అలా పీలేరు నియోజకవర్గంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత నల్లారి కిషోర్ పికప్ అయినట్లు కనిపిస్తున్నారు.
2014లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన కిషోర్ తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అటు వైసీపీ నేతల అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. తాజాగా పీలేరు హైవేకు ఆనుకుని ఉన్న భూముల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కిషోర్ ఆరోపణలు గుప్పించారు. అందుకు తగ్గట్టుగా ఆధారాలు కూడా చూపించారు.
దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, రైతులకు అండగా ఉంటానని కిషోర్ చెబుతున్నారు. ఇలా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న కిషోర్ పీలేరులో చాలావరకు పికప్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పీలేరులో సైకిల్ సవారీ కొనసాగడం ఖాయమని అంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పీలేరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎందుకంటే పీలేరులో టీడీపీ చివరి సారిగా గెలిచింది 1994లోనే. ఆ తర్వాత జరిగిన 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. కానీ 2024లో పీలేరులో టీడీపీ సత్తా చాటనుందని అంటున్నారు. చూడాలి మరి కిషోర్ టీడీపీ జెండా ఎగరవేస్తారో లేదో..?
Discussion about this post