పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గాల్లో నిడదవోలు ఒకటి. ఈ నియోజకవర్గంలో టీడీపీ హవా ఎక్కువగా ఉంటుంది. 2009, 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున బూరుగుపల్లి శేషారావు వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో బూరుగుపల్లిపై వైసీపీ తరుపున శ్రీనివాస్ నాయుడు విజయం సాధించారు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ మెరుగైన పనితీరు కనబర్చడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన శ్రీనివాస్..నిడదవోలు రాజకీయాలపై పూర్తిగా గ్రిప్ సాధించలేకపోయారనే చెప్పొచ్చు. ఏదో ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు తప్ప నియోజకవర్గంలో గొప్ప పనులు ఏమి జరగడం లేదు. ప్రజల అవసరానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే పని చేయలేకపోతున్నారు. అటు నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయి. ఇసుక, ఇళ్ల స్థలాల్లో వీరి దోపిడీకి అంతే లేదని తెలుస్తోంది.

ఇంకా ఇళ్ల స్థలాల్లో చదును పేరుతో బాగానే డబ్బులు వెనుకవేశారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా నివాసయోగ్యం కాని భూములని పేదలకు ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ వైసీపీ ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. అందుకే నిడదవోలు ప్రజలకు వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకిత పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ తరుపున బూరుగుపల్లి దూకుడుగా ఉంటున్నారు. నియోజకవర్గంపై పూర్తి పట్టున్న బూరుగుపల్లి, ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, టీడీపీని బలోపేతం చేస్తున్నారు.

అటు వైసీపీ చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజల మద్ధతు పెంచుకుంటున్నారు. రెండేళ్లలో బూరుగుపల్లి చాలావరకు పుంజుకున్నారని తెలుస్తోంది. అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిడదవోలులో బూరుగుపల్లి విజయం ఖాయం అనే విధంగా రాజకీయం మారిందని చెప్పొచ్చు. మొత్తానికైతే తక్కువ సమయంలోనే ఓటమి నుంచి కోలుకుని బూరుగుపల్లి, నిడదవోలులో లీడింగ్‌లోకి వచ్చేశారు.
Discussion about this post