రాజకీయాల్లో ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు పుంజుకోవడం అనేది నేతలకు అత్యంత కీలకమైన విషయం. ఇప్పుడు అదే పనిచేస్తున్నారు టీడీపీ యువనాయకుడు.. బొజ్జల సుధీర్. చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన.. సుధీర్.. కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. వైసీపీ నుంచి గెలిచిన మధుసూదన రెడ్డి దూకుడుగా ఉండడమే. దీంతో సుధీర్ ఒకింత సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ.. పార్టీ పరంగా మాజీ మంత్రి నారా లోకేష్‌కు మద్దతుగా ఉండడం.. ట్విట్టర్‌లోనూ దూకుడుగా ఉండడం తెలిసిందే.
ఇక, లోకేష్ టీంలో ఉన్న యువ నేతల్లో సుధీర్ కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు కీలక నేతలు ఉంటే.. వారిలో సుధీర్ లోకేష్‌కు రోజూ టచ్‌లో ఉంటూ.. ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్నా రు. ఇప్పుడు గత వారం రోజులుగా ప్రజల మధ్యకు కూడా వెళ్తున్నారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్దిని ఆయన వివరిస్తున్నారు. వైసీపీ సర్కారు వచ్చి రెండేళ్లు పూర్తయినా.. ఇప్పటి వరకు ఏమీ జరగలేదనే విషయాన్ని సుధీర్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇక, యువతను కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా కరోనా సమయంలో ఎమ్మెల్యే అనుసరించిన తీరుతో నియోజకవర్గానికి చెడ్డ పేరు వచ్చిందని.. ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా ? అని సుధీర్ కీలక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు.. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. అదే సమయంలో తన తండ్రి గోపాల కృష్ణ మద్దతు దారులను వయసుతో సంబంధం లేకుండా కలుస్తున్నారు. వారికి అండగా ఉంటానని కూడా హామీ ఇస్తున్నారు.
కరోనా సమయంలో పార్టీ తరఫున ఆయన కొంత మేరకు సేవలు అందించారు. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సైలెంట్ కావడం .. లోకేష్ నుంచి వ్యూహాలు అందడంతో సుధీర్ దూకుడు పెంచారని అంటున్నారు పరిశీలకులు.
Discussion about this post