లోకేష్ టీడీపీకి భావి వారసుడు. ఆ మాటకు వస్తే మరో నలభై ఏళ్ళు పార్టీని ముందుకు తీసుకువెళ్ళేందుకు తయారుగా ఉన్న నాయకుడు. చంద్రబాబు నాలుగున్నర రాజకీయ జీవితం అనుభవం అంతా ధారబోసి టీడీపీని ఇంతటి స్థాయికి తెచ్చారు. ఎన్టీయార్ టీడీపీని స్థాపిస్తే దానికి గ్లామర్ ఒక్కటే సరిపోదని గ్రామర్ ని కూడా అద్దిన అపర చాణక్యుడు చంద్రబాబు. అందుకే ఈ రోజు టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉంది. నాయకులు ఎంతమంది బయటకు పోయినా చెక్కుచెదరకుండా నిలబడి ఉంది. టీడీపీని మరిన్ని ఎత్తులు ఎక్కించే బాధ్యత ఆ పార్టీలో యువ నాయకుల మీదనే ఉంది.లోకేష్ కూడా తన ఐడియాలజీని పూర్తిగా అమలు చేస్తున్నారు. పార్టీకి యువ రక్తాన్ని నింపుతున్నారు. తనతో పాటు నడిచే వారిని ఆయన స్వయంగా ఎంచుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాల్లో అతి పెద్ద యువ సైన్యమే తయారు అవుతోంది. ఆ లిస్ట్ లో విశాఖ జిల్లాలో మొట్టమొదటి పేరుగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడి పేరు ఉంది. తండ్రికి తగిన తనయుడిగా విజయ్ రూరల్ జిల్లాలో గట్టి నాయకత్వాన్ని అందిస్తున్నారు. అదే విధంగా పెందుర్తి నుంచి మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనయుడు బండారు అప్పలనాయుడు ఉన్నారు. ఈ యువనేత కూడా అధికార వైసీపీ మీద దూకుడు చూపించడంతో ముందుటారని పేరు.
ఇక ఏజెన్సీలో తీసుకుంటే తండ్రి కిడారి సర్వేశ్వరరావు మరణం తరువాత అనూహ్యంగా టీడీపీలో చేరి మంత్రి అయిన కిడారి శ్రావణ్ కూడా లోకేష్ టీమ్ లో ఉన్నారు. ఏజెన్సీలో సైకిల్ జోరు పెంచేందుకు శ్రావణ్ చేస్తున్న కృషి చాలానే ఉంది. ఏజెన్సీలో ఈసారి రెండు సీట్లు గెలుచుకోవడానికి టీడీపీ జోరుగా పావులు కదుపుతోంది. దానికి తగినట్లుగ కిడారి అడుగులు వేస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాన్ని కూడా కలుపుకుని ముందుకు పోతున్నారు. భీమిలీ నుంచి యువ నేత కోరాడ రాజబాబుని ముందుకు తెచ్చారు. ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో లోకేష్ ఆయన సేవలకు గుర్తింపుగా ఇంచార్జి పదవి ఇచ్చారు.ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే యువనేతగా ఉన్న కిమిడి నాగార్జునకు జిల్లా పగ్గాలు అప్పగించారు. అలాగే విజయనగరం లో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుని ప్రోత్సహిస్తున్నారు. ఎస్ కోట నుంచి కోళ్ళ ఫ్యామిలీకి చెందిన మూడవ తరాన్ని ముందుకు తెస్తున్నారు. పార్వతీపురంలో ఎమ్మెల్సీ ద్వారం రెడ్డి జగదీష్ కి అండదండలు అందిస్తున్నారు. సాలూరులో గుమ్మడి సంధ్యకు పార్టీ పగ్గాలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా విషయనికి వస్తే రాజకీయంగా ప్రతిష్టాత్మకమైన కుటుంబంగా ఉన్న గౌతు ఫ్యామిలీకి చెందిన శిరీషను లోకేష్ తన టీమ్ లో పెట్టుకున్నారు. ఆమె బీసీ సామాజికవర్గానికి చెందిన యువ నాయకురాలు కావడంతో ఆమెను బాగా ప్రోత్సహిస్తున్నారు.
ఇక ఇచ్చాపురంలో బెందాళం అశోక్ పార్టీని పటిష్టంగా తయారు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గా దూకుడుకు మారుపేరుగా ఉన్న కూన రవికుమార్ ని రంగంలోకి దింపడం కూడా లోకేష్ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇక శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోన్ నాయుడు ఎటూ లోకేష్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. మొత్తానికి మరిన్ని నియోజకవర్గాలలో మరింత మంది యువ నాయకులను గుర్తించడం ద్వారా ఈసారి మూడు జిల్లాలో అదిరిపోయే స్ట్రాటజీతో ముందుకు సాగాలని టీడీపీ చూస్తోంది.
Discussion about this post