తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ విషయం పెద్ద రచ్చ అయ్యేలా కనిపిస్తోంది. ప్రత్యర్ధులు పన్నుతున్న కుట్రకు టీడీపీ అభిమానులు వర్సెస్ ఎన్టీఆర్ అభిమానులు అనే మాదిరిగా పోరు నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలంటూ కొందరు హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా లేకపోయినా సరే, కొందరు పెయిడ్ బ్యాచ్ టీడీపీలో చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక సినిమా విషయంలో ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ మాదిరిగా పోరు క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ పిఆర్‌ఓ మహేష్ ఎస్ కోనేరు నిర్మాతగా ఉన్న తిమ్మరుసు చిత్రం తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇందులో లోకేష్‌ని ట్రోల్ చేసే సీన్ ఉందంటూ టీడీపీ అభిమానులు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే గనుక నిజమైతే తాము ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని బహిష్కరిస్తామని, అసలు ఎన్టీఆర్ సినిమాని ఎక్కువగా చూసేదే టీడీపీ అభిమానులే అని, వారు సినిమా చూడకపోతే ఎన్టీఆర్ సినిమాకు ఇబ్బంది అనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కొందరు బాయ్‌కాట్ చేయడం వల్ల ఎన్టీఆర్‌కు వచ్చే నష్టమేమీ లేదని, ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ రాకపోతే టీడీపీకే కష్టమని అంటున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో లోకేష్ వర్సెస్ ఎన్టీఆర్ అనే విధంగా కొందరు రచ్చ క్రియేట్ చేసినట్లు కనబడుతోంది. టీడీపీ, ఎన్టీఆర్ వేరు వేరు అనే విధంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించి టీడీపీని దెబ్బకొట్టడానికి చూస్తున్నారని కొందరు తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్ధులు కావాలని చేస్తున్న విషప్రచారంలో టీడీపీ వాళ్ళు భాగస్వామ్యం కావొద్దని సూచిస్తున్నారు.
Discussion about this post