ఆమె స్టైలిష్‌గా ఉంటారు. ఉద్యమాలు జరిగినా.. రోడ్డెక్కి నిరసనలు చేయాలన్నా.. ఆమె స్టయిల్ డిఫరెం ట్. పోనీ.. అందరినీ కలుపుకొని పోతున్నారా? అంటే.. అది కూడా లేదు. కేవలం తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆమె అందరికీ దూరమవుతున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ఆశలతో తెలుగు మహిళ పగ్గాలు అప్పగించిన.. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత! గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాక.. చంద్రబాబు ఆమెకు తెలుగు మహిళ పగ్గాలు అప్పగించారు.

రాష్ట్రంలో మహిళలను పార్టీవైపు ఆకర్షించేలా చేయడంతోపాటు.. పార్టీకి మహిళల్లో మంచి మార్కులు పడేలా చేస్తారనే సదుద్దేశంతో చంద్రబాబు ఈ పదవిని ఆమెకు అప్పగించారు. అయితే.. ఇప్పటి వరకు పట్టుమని.. ఓ పది మందిని కూడా పార్టీలోకి చేర్చుకోలేక పోయారు. పైగా.. మహిళలను పార్టీవైపు దృష్టి సారించేలా చేయడంలోనూ.. వంగలపూడి విఫలమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో ఇదే పదవిని అలంకరించిన నన్నపనేని రాజకుమారి.. ఎప్పటికప్పుడు.. గ్రాఫ్‌ను పెంచుకున్నారనే వాదన పార్టీలో వినిపించేది. ప్రతి ఒక్కరినీ కలిసేవారు. ముఖ్యంగా మాస్ కు అత్యంత దగ్గరగా ఉండేవారు.

ఎక్కడ సమస్య వచ్చినా.. మీడియా కోసం ఎదురు చూడకుండా.. సమస్య పరిష్కారంపై దృస్టి పెట్టారు. అదేసమయంలో మంచి వాయిస్‌తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. నిజానికి ప్రతిపక్షంలోనూ నన్నపనేనికి మంచి మార్కులు ఉండేవి. ఆమెకు అందరూ స్నేహితులుగా ఉండేవారు. దీంతో పార్టీలో మహిళలకు ప్రత్యేక గుర్తింపు.. స్థానం దక్కాయి. కానీ, వంగలపూడి బాధ్యతలు చేపట్టాక.. సొంత పార్టీలోనే మహిళలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని.. మహిళా నాయకుల సమస్యలను పట్టించుకునే తీరిక కూడా ఆమెకు ఉండడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

కేవలం మీడియా ముందుకు వచ్చి.. నాలుగు విమర్శలు చేయడంతోనే రాజకీయాలు సరిపెడుతున్నార ని, నిరసనల సమయంలోనూ.. సమయానికి వచ్చి డ్యూటీ ముగిసింది! అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే.. క్షేత్రస్థాయిలో మహిళలను కలుసుకునేది ఎప్పుడు..? పార్టీని బలోపేతం చేసేది ఎప్పుడు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. మరి ఇదే విధానం కొనసాగిస్తే.. ఆమెకు వ్యక్తిగతంగా నష్టం లేకున్నా.. పార్టీతీవ్రంగా నష్ట పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post