నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు…వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచే, అదే పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉంటూ ప్రతిరోజూ మీడియా సమావేశాలు పెడుతూ జగన్ ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపించే కార్యక్రమం చేస్తారు. ప్రతిసారి రఘురామ ఇదే విధంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

దీంతో రఘురామకు ఎలాగైనా చెక్ పెట్టేయాలని వైసీపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి అయితే ఢిల్లీలో ఎక్కిన గడప…దిగిన గడప అన్నట్లు స్పీకర్, ప్రధాని, కేంద్ర మంత్రులని కలుస్తూ రఘురామపై వేటు వేయాలని కోరుతున్నారు. మరి ఢిల్లీ పెద్దలతో రాజుగారికి సత్సంబంధాలు ఉండటం వలన అనుకుంటా, ఆయనపై వేటు పడటం లేదు.ఇక వేటు వేయాలని చూస్తున్న జగన్, విజయసాయిల టార్గెట్‌గా రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా విజయసాయిరెడ్డికి కొత్త పేరు పెట్టి మరీ రఘురామ సెటైర్లు వేశారు. తనను ఎంపీ పదవి నుంచి తప్పించడానికి పార్టీ జాకా(జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి) కిందా మీద పడుతున్నారని, తన పదవిని పీకే శక్తి ఎవ్వరికీ లేదని, జగన్ బిక్షతో దొడ్డిదారిన ఎంపీ అయ్యింది విజయసాయి అని, తాను ప్రజల మద్ధతు ఎంపీ అయ్యానని అన్నారు. జాకాకు దమ్ముంటే వైసీపీ నుంచి తనను బహిష్కరించాలని రఘురామ సవాల్ విసిరారు.

అయితే రఘురామ ఎంపీ పదవిపై వేటు వేయాలని చూస్తున్న వైసీపీ, ఆయన్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదో అర్ధం కాకుండా ఉంది. ఒకవేళ బహిష్కరిస్తే రఘురామ స్వతంత్ర ఎంపీగా మారిపోతారు. దాంతో వేటు వేయడం కుదరదని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా రఘురామ మాత్రం వైసీపీ నేతలని ముప్పు తిప్పలు పెడుతున్నట్లే కనిపిస్తోంది.
Discussion about this post