వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిన విషయం తెలిసిందే. ఇక ఈ రెండేళ్లలోలోనే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకిత మూటగట్టుకుంటున్నారు. ఎన్నికల్లో ఏదో జగన్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు..తర్వాత మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారు. అలాగే పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటున్నారు. అలా ఈ రెండేళ్లలో వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేల్లో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. జగన్ వేవ్‌లో బొల్లా వినుకొండలో టీడీపీ నేత జివి ఆంజనేయులుపై గెలిచారు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లా, ఈ రెండేళ్లలో ఎక్కువగా వివాదాల్లోనే చిక్కుకున్నారు. ముందు నుంచి ఎమ్మెల్యే ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఇసుకలో లెక్కలేని విధంగా దోచుకుంటున్నారని తెలిసింది.
ముఖ్యంగా పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పేరుతో ఎమ్మెల్యే కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ నేత ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొన్ని ఆధారాలు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని భూములు ఇచ్చిన రైతులకు తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇలా పలు రకాలుగా ఎమ్మెల్యేగానీ, ఎమ్మెల్యే అనుచరులుగానీ దోచుకున్నారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ నేతకు చెందిన శివశక్తి అనే స్వచ్ఛంద సంస్థని అడ్డుకుని ఎమ్మెల్యే మిస్టేక్ చేశారని అంటున్నారు.ఎలాంటి లాభాపేక్ష లేకుండా శివశక్తి సంస్థ ప్రజలకు సేవ చేస్తుంది. కరోనా బాధితులకు ఉచితంగా ఆహారం అందించే కార్యక్రమం చేస్తుంటే, ఆ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారు. పైగా ఆ సంస్థపై ఆరోపణలు చేశారు. అయితే ఏమన్నా సంస్థతో ఇబ్బందులు ఉంటే న్యాయపరంగా వెళ్లాలని, అలా కాకుండా పేదలకు అన్నం పెడుతుంటే అడ్డుకోవడం కరెక్ట్ కాదని నియోజకవర్గంలోనే ప్రజలే మాట్లాడుకునే స్థాయికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఇక తాజాగా నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు పేరుతో భూమి ఇవ్వని రైతు పొలంలో బలవంతంగా భూమి పూజ చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఇలా ఎమ్మెల్యే ఎక్కువగా వివాదాల్లోనే ఉండటం వల్ల నియోజకవర్గంలో టీడీపీకి బాగా ప్లస్ అవుతుంది. ఇప్పటికే చాలావరకు టీడీపీకి లీడింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నరసారావుపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా ఉండడంతో నియోజకవర్గంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఏదో ఒక పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ టీడీపీ గ్రాఫ్ పెంచుతుంటూ అధికార వైసీపీకి సవాళ్లుగా మారుతున్నాయి.
Discussion about this post