ఆయనది రాజకీయ కుటుంబం కాదు, వ్యాపారం నిమిత్తం విశాఖకు వచ్చారు. అందరితో మంచిగా ఉండడమే ఆయకు తెలుసు. సామాన్యులలో అతి సామాన్యుడు ఆయన. అందరితోనూ కలసిపోయే నైజం ఆయన సొంతం. అందుకే ఆయనను విజయాలు అలా వరసబెట్టి మరీ వరిస్తున్నాయి. ఆయనే వెలగపూడి రామక్రిష్ణ బాబు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారి ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఎన్నికలలో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్ విభజనలో విశాఖ తూర్పు ఏర్పడింది. అప్పట్లో ఏపీలో వైఎస్సార్ సీఎం గా ఉన్నారు.
మరో వైపు ప్రజారాజ్యం పార్టీ పెట్టి వెండి తెర మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగంలోకి దిగారు. ఇలా రెండు పార్టీలు గట్టిగానే బరిలో ఉన్న వేళ ఢీ కొట్టి మరీ గెలిచిన వీరుడుగా వెలగపూడిని చెప్పుకోవాలి. విశాఖ తూర్పులో ఆయన సామాజిక వర్గం ఏదీ పెద్దగాలేదు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉండేది యాదవులు, ఆ తరువాత మత్య్సకారులు. ఇక ఇతర బీసీ సామాజిక వర్గాలు కూడా గణనీయంగా ఉన్నారు. మొత్తానికి చూస్తే బీసీలు ఎక్కువగా ఉండే విశాఖ తూర్పులో అగ్ర కులస్థుడైన వెలగపూడి వంటి నాయకుడు ఒకటి కాదు మూడు సార్లు గెలవడం అంటే గొప్ప విషయమే.ఈ రోజుల్లో రాజకీయాల్లో కులం ఎంత ప్రధనా పాత్ర పోషిస్తుందో అందరికీ తెలుసు. అలాంటిది కులబలం లేకపోయినా వెలగపూడి గెలవడం వెనక సీక్రెట్ ఆయన మంచితనం. అందరితోనూ డైరెక్ట్ గా రిలేషన్స్ నెరపడం. తన నియోజకవర్గంలో ఏ ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా కూడా హాజరయ్యే మొదటి వ్యక్తి వెలగపూడి అని చెప్పాలి. రాజకీయాల్లో ఇలాంటి కొత్త ఒరవడి ఇంతవరకూ ఎవరూ అనుసరించి ఉండరు. ప్రతీ కుటుంబానికి కష్టంలోనూ నష్టంలోనూ తాను ఉన్నాను అనిపించుకునే వెలగపూడి అటు మత్యకారులకు, ఇటు యాదవులకు కూడా ఆప్తుడు అయ్యారు. వారి కుటుంబ సభ్యుడే అయ్యారు. అందుకే వారు తమ కులస్థులు పోటీ చేసినా కూడా తోసిరాజని వెలగపూడినే గెలిపిస్తూ వస్తున్నారు.
వెలగపూడి తమ మనిషి అని వారు భావిస్తున్నారు. అందుకే ఆయన మీద మూడు సార్లు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రత్యర్ధులుగా తలపడినా కూడా జనాలు ఆయన్నే గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు. ఇక వెలగపూడిలో మరో మంచి విషయం ఏంటి అంటే ఆయన ఏడాదిలో మూడు వందల అరవై అయిదు రోజులూ తన పార్టీ ఆఫీస్ లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన ప్రతీ రోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. దానికి వచ్చిన జనాలు చెప్పుకునే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అధికారులకు ఫోన్లు చేసి మరీ వారి సమస్య తీరేలా కడవరకూ చూస్తారు. ఇది ఆయన ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.ఈ రోజులలో ఒక నాయకుడిని ఎన్నుకుంటే మళ్ళీ కనిపించని పరిస్థితి. అలాంటిది వెలగపూడి రోజులో ఏ టైమ్ అయినా జనాలకు అందుబాటులో ఉండడమే ఆయనకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ఆయనని ఓడించాలని వైసీపీ విశ్వప్రయత్నం చేసినా కూడా వీలు కాలేదు. అంతటి జగన్ గాలిలోనూ ఆయన గెలిచారు. అంటే వైఎస్సార్, జగన్, చిరంజీవి వంటి వారి చరిష్మా కూడా వెలగపూడి రాజకీయ విజయాలను ఎక్కడా ఆపలేదని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఇక 2014లో అయితే ఏకంగా 47 వేల పై చిలుకు మెజారిటీ సాధించి వెలగపూడి రాష్ట్రంలోనే రెండవ స్థానాన్ని సాధించారు.
విశాఖ టీడీపీలో ఆయన పెద్ద తలకాయగా ఉంటున్నారు. పార్టీ తరఫున గట్టిగా నిలబడి ప్రజల కోసం బలమైన వాణిని వినిపిస్తున్నారు. ఇప్పటికి మూడు సార్లు విశాఖ తూర్పు నుంచి గెలిచిన వెలగపూడి మీద గత రెండేళ్ళుగా వైసీపీ సర్కార్ అక్రమ కేసులు పెట్టినా ఆయన్ని సవాల్ చేసి ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతున్నారు. విశాఖలో టీడీపీ చూసుకోవాల్సిన అవసరం లేని సీటుగా తూర్పు నియోజకవర్గాన్ని నిలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా వెలగపూడికి మంత్రి పదవి గ్యారంటీ అన్న మాట కూడా ఉంది. దాని కంటే ముందు 2024 ఎన్నికల్లో వెలగపూడి మరోమారు విజయం సాధించడం ఖాయమని రాసేసుకోవచ్చు అంటున్నారు తమ్ముళ్ళు.వైసీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా నాయకులు ఎందరు వచ్చినా కూడా వెలగపూడిని ఓడించడం కష్టమన్న భావన తూర్పులో ఉంది. వైసీపీలో ఇపుడు అక్రమాని విజయనిర్మల తూర్పు ఇంచార్జిగా ఉన్నారు. ఆమె ఎవరికీ కలుపుకుని పోయే రకం కాదని ఆ పార్టీ నాయకులే చెబుతారు. ఇక యాదవులే ఆమె నాయకత్వం పట్ల విముఖంగా ఉన్నారు. దీనిని బట్టి చూస్తే వెలగపూడి విజయం మరో మారు ఖాయమని అర్ధమైపోతోంది కదా.
Discussion about this post