విశాఖని సినీ రాజధానిగా చెబుతారు. అక్కడ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని రెండు దశాబ్దాలుగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి రామానాయుడు అందరి కంటే ముందు చొరవ చూపించి విశాఖలో రామానాయుడు స్టూడియోను నిర్మించారు. ఆయన ఎంపీగా ఉన్న టైమ్ లో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు నాటి సీఎం చంద్రబాబు ఆహ్వానం మీద వచ్చారు. ఆ రోజుల్లో విశాఖ బీచ్ రోడ్డు పెద్దగా యాక్టివిటీ ఏదీ లేకుండా ఉండేది. అలాంటి చోట రామానాయుడు 34 ఎకరాలను తీసుకుని రాళ్ళు, కొండలను దొలిచి పది ఎకరాలలో అందమైన స్టూడియోను కట్టారు.
ఈ స్టూడియో 2008లో ప్రారంభం అయింది. ఏ రోజు అయినా విశాఖ సినీ రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ముందు చూపుతో రామానాయుడు ఆ రోజు వేసిన పునాది ఇది. అంతే కాదు ఇక్కడ రామానాయుడు తన సొంత సినిమాలను కూడా చిత్రీకరించారు. మరి విశాఖను సినీ రాజధాని చేస్తామని చెబుతున్న వైసీపీ సర్కార్ రమానాయుడు స్టూడియో మీద కన్నేసింది. ఈ స్టూడియోను పరిపాలనా రాజధాని కనుక విశాఖ వస్తే ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో ఆరు నెలలుగా ఈ స్టూడియో తమ పరం చేయాలంటూ కుటుంబ సభ్యుల మీద వత్తిడి తెస్తోంది.అయితే స్టూడియోను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని రామానాయుడు కుటుంబం అంటోంది. అది తమ తండ్రి మిగిల్చిన తీపి గుర్తు అని, దాన్ని ఎలా వదులుకుంటామని వారు అంటున్నాట్లుగా భోగట్టా. అయితే దీనికి రెట్టింపు స్థలాన్ని వేరే చోట ఇస్తామని, తమకు ఈ స్థలం ఇవ్వాల్సిందే అని ప్రభుత్వ పెద్దలు పట్టుబడుతున్నారుట. ఒకవేళ ఇచ్చేందుకు వీలు లేకపోతే తాము ప్రభుత్వ నిబంధలను ముందుకు తెచ్చి టేకోవర్ చేస్తామని కూడా అంటున్నారుట. ఈ స్టూడియో చక్కనైన ప్రదేశంలో ఉండడమే ప్రభుత్వ డిమాండ్ కి కారణం.
స్టూడియో నుంచి చూస్తే అటు సిటీ, ఇటు భీమిలీ, మరో వైపు సముద్రం కూడా కనిపిస్తుంది. ఇంతలా అద్భుతంగా ప్లాన్ చేసి రామానాయుడు దీన్ని నిర్మించారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో మొండి పట్టుదలకు పోతోంది అని అంటున్నారు. అనుకున్నట్లుగా చేసుకుపోవాలని చూస్తోంది. అదే జరిగితే విశాఖలో సినీ కళకు అద్దం పట్టే రామానాయుడు స్టూడియో లేకుండా పోతుందా. చూడాలి మరి.
Discussion about this post