దాదాపుగా ఆరు నెలలుగా ఉద్యమిస్తున్నా కూడా బీజేపీ నేతలు ఈ రోజు వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను కలవలేదు. పరామర్శించలేదు. జనసేన సహా అన్ని పార్టీల నేతలు దీక్షా శిబిరానికి వెళ్ళి మరీ సంఘీభావాన్ని తెలియచేశారు. బీజేపీ కూడా కేంద్ర నిర్ణయం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పవచ్చు. తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని హామీ కూడా ఇవ్వవచ్చు. కానీ వారు మౌనంగానే ఉండిపోయాయి. మరో వైపు గోదావరి జిల్లాలకు చెందిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మాత్రం ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోదని అపుడపుడు హామీలు ఇస్తూ వచ్చారు. అదే సమయంలో దేశంలో ఎన్నో పరిశ్రమలు ప్రైవేట్ పరం అవుతున్నాయని ఆయన అనడం కూడా పలు రకాలైన అనుమానాలకు తావు ఇచ్చేలా ఉంది.
దీంతో ఉక్కు కార్మికులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ బీజేపీ మద్దతు గా ఉందా లేక కేంద్రానికి వత్తాసా అన్నది వారికి అసలు అర్ధం కాని స్థితిగా ఉంది. ఈ నేపధ్యంలో హఠాత్తుగా విశాఖకు చెందిన బీజేపీ నాయకులు హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆద్వర్యంలో వారు కేంద్ర ఉక్కు మంత్రిని కలసి ప్లాంట్ ని ప్రైవేట్ కాకుండా చూడాలని ఒక వినతిపత్రం ఇచ్చారు. అదే సమయంలో ప్లాంట్ కి ఉన్న 18 వేలా ఎకరాల భూమి తిరిగి నిర్వాసితులకు ఇవ్వాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉపాధికి భరోసా కల్పించాలని కోరారు.ఈ డిమాండ్లు చూస్తూంటే ప్లాంట్ ప్రైవేట్ పరం అయిన తరువాత ఉపశమనం చర్యల కొరకు కోరిన కోరికలా లేక ప్లాంట్ ప్రైవేట్ కాకుండా చూడడం కోసమా అన్న చర్చ ఉక్కు కార్మికులలో బయల్దేరింది. నిజానికి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం వెనక ముఖ్య ఉద్దేశ్యమే దానికి ఉన్న వేలాది ఎకరాల మిగులు భూమి కోసమే అని చెబుతారు. ఆ భూమి విలువ ఈ రోజు లక్షల కోట్లు చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ని అలా ఎవరికో కట్టబెట్టి భూములను వేలం వేయడానికి కూడా కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రచారం అవుతోంది. ఇపుడు బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్ళి నిర్వాసితులకు తిరిగి ఆ భూములు ఇవ్వలని కోరడం అంటే ప్రైవేట్ పరం కచ్చితంగా అవుతుందని, కనీసం భూముల విషయంలో అయినా దయ చూపాలని కోరడమేనా అన్న మాట అయితే ఉంది.
మొత్తానికి చూసుకుంటే ఉన్న ప్లాంట్ కే దిక్కు లేదు అంటూంటే మిగులు భూముల విషయంలో వెనక్కి ఇస్తారా అన్న భయాందోళనలు కార్మిక వర్గాలలో ఉన్నాయి. ఏది ఏమైనా కూడా కేంద్రం మాత్రం దూకుడుగా ముందుకు పోతోంది. విశాఖ బీజేపీ నేతలు తాము కూడా చెప్పిచూసామనిపించుకోవడానికే ఈ ఢిల్లీ యాత్ర చేపట్టారు అంటున్నారు.
Discussion about this post