ఉమ్మడి ఏపీ రెండుగా చీలింది. అలాగే ఎన్నో పార్టీలు చీలాయి. కానీ ఒక కుటుంబం రెండుగా చీలి రెండు పార్టీలు పెట్టడం మాత్రం రాజకీయ విచిత్రమే. అది వైఎస్సార్ కుటుంబంలోనే జరిగింది. తండ్రి పేరుతో జగన్ వైసీపీని స్టార్ట్ చేసి ఏపీలో అధికారం చేపట్టారు. మరి చెల్లెలు షర్మిలకు ఇక్కడ చోటు లేదు అనుకున్నారో ఏమో తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టేశారు. దానికి వైఎస్సార్ టీపీ అన్న పేరు పెట్టి రాజకీయ రధం నడుపుతున్నారు.
మరి ఏపీలో జగన్ పార్టీ నుంచి ఎవరైనా ఆ కొత్త పార్టీలో చేరారా అంటే చాలా ముఖ్య నేతనే అక్కడికి వెళ్లారు అంటున్నారు. ఆమె ఎవరో కాదు వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ అని చెబుతున్నారు. విజయమ్మకు కొడుకు, కూతురు రెండు కళ్ళు అన్న సంగతి తెలిసిందే. వైసీపీ విజయానికి ఆమె గౌరవ అద్యక్షురాలి హోదాలో ఎంతో చేశారు. ఆ పార్టీ గెలుపు కోసం 2012 నుంచి ప్రజలలోనే ఉంటున్నారు.ఇక 2019 ఎన్నికల్లో వైసీపీని ఆమె గెలిపించడానికి ఎన్నో సభలలో పాల్గొన్నారు. అటువంటి విజయమ్మ ఇపుడు వైఎస్సార్ టీపీలో చేరిపోయారా అన్న చర్చ వస్తోంది. కూతురు షర్మిల వెంటనే ఆమె తిరుగుతున్నారు. కుమార్తె పెట్టిన పార్టీకి ఆమె పెద్ద దిక్కుగా ఉంటున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సభలో కూడా విజయమ్మ ముఖ్య ఆకర్షణగా ఉన్నారు. ఆమె కీలకమైన ప్రసంగం చేశారు. మరి రానున్న రోజులలో కుమార్తెతో కలసి తెలంగాణా జిల్లాలలో కూడా విజయమ్మ పర్యటిస్తారా అన్న చర్చ కూడా ఉంది.
మరి జగన్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ ఒకే టైమ్ లో మరో పార్టీలో కీలకంగా వ్యవహరించడం ద్వారా విజయమ్మ కొత్త రికార్డు సృష్టిస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది. మరో టాక్ ప్రకారం ఆమె ఇక వైసీపీకి దూరమైపోతారని.. షర్మిల పార్టీలోనే ఉంటారని అంటున్నారు. అయితే తల్లి అటూ ఇటూ ఉంటే జగన్ ఏం చేయబోతున్నారు అన్నదే ఇపుడు ఆసక్తికరమైన అంశంగా ఉంది.
Discussion about this post