వైసీపీని నెత్తిన పెట్టుకుని మహా విశాఖ నగర పాలక సంస్థ పీఠం మీద జనం కూర్చోబెట్టారు. మేయర్ సీటును అప్పగించారు. మరి దాని ఫలితం ఏంటో తెలుసా. ఏకంగా చెత్తకు కూడా పన్నులు వేసి పాతిక లక్షల నగర జనాభా మీద పెను భారం మోపారు. ఒక్కో ఇంటికీ నెలకు 120 రూపాయలు వంతున చెత్త పన్ను విధించి దానికి యూజర్ చార్జి అని పేరు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామంటూ దానికి కలరింగ్ ఇచ్చారు.
ఇప్పటికే విలువ ఆధారిత ఆస్తి పన్నుని ప్రవేశపెట్టి జనాల నడ్డి విరగ్గొట్టారని బాధ పడుతూంటే దానికి తోడు అన్నట్లుగా చెత్త పన్ను విధించారని విశాఖ వాసులు మండిపడుతున్నారు. నిజానికి జీవీఎంసీ కన్జర్వేటివ్ టాక్స్ అంటూ వసూల్ చేస్తోంది. దానిలోకి ఈ చెత్త పన్ను లాంటివి కూడా వచ్చేస్తాయి. మరి అది కాకుండా వేరుగా యూజర్ చార్జీలు పెట్టడమేంటి అని జనాల నుంచే కాదు మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. మరో వైపు చూస్తే జీవీఎంసీలో మెజారిటీ కార్పోరేటర్లుగా వైసీపీ వారు ఉన్నారు. వారి బలం, బలగం చాలా పెద్దది అయినా కూడా విపక్షం గట్టిగానే పోరాడింది.
విపక్షంలో ఉన్న టీడెపీ జనసేన, సీపీఐ, సీపీఎం కూడా కలసి చెత్త పన్ను మీద గట్టిగానే వాదించాయి. కానీ వైసీపీ కార్పోరేటర్లు మాత్రం ఇది సబబే అంటూ వడ్డింపునకు జై కొట్టారు. ఎన్నికలు జరిగి గట్టిగా ఆరు నెలలు కూడా కాకుండానే మరీ ఇంత మోత అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఇక ఆస్తి పన్ను విషయంలోనూ ఎన్నికల ముందు ఒకటి చెప్పి ఆనక మరోటి చేశారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఏ మాత్రం నొప్పి లేకుండానే ఆస్తి పన్నులు విధించామని అంటున్నారు.
పన్ను కట్టేవారికి ఆ నొప్పి ఉంటుంది కానీ మంత్రులకు ఎక్కడ ఉంటుంది అన్నది జనం మాటగా ఉంది. మరి విశాఖలో గెలిచేశామని సంబరపడిపోతున్న వైసీపీకి ఈ చెత్త పన్ను,ఆస్తిపన్నులే రానున్న రోజుల్లో రాజకీయంగా పెద్ద దెబ్బగా మారుతాయని అంటున్నారు. ఇకనైనా వీటిని రద్దు చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా ఫ్యాన్ పార్టీకి ఓటమి ఖాయమని జనం నుంచే హెచ్చరికలు వస్తున్నాయంటే ఆలోచించుకోవాల్సిందే.
Discussion about this post