టీడీపీ సీనియర్ నేత, గత ఎన్నికలలో ఆ పార్టీ నుంచి చీరాల ఎమ్మెల్యే గా గెలిచిన కరణం బలరాం రాజకీయాలు చివరి దశకు వచ్చేశాయి. గత ఎన్నికలకు ముందే ఆయనకు సీటు రాదని అనుకున్నారు. అయితే చివర్లో చీరాల లో పోటీ చేసేందుకు ఎవ్వరూ లేకపోవడంతో చంద్రబాబు ఆయనకు చీరాల సీటు ఇవ్వడం.. అక్కడ గెలవడం జరిగాయి. ఆ తర్వాత వెంటనే ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు చీరాలలో కరణం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక్కడ పార్టీ అధిష్టానం కరణంకు పెత్తనం ఇచ్చినట్టు ఉన్నా ఆమంచి వర్గం ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్య్రంగా పోటీ చేసి మరీ కరణం వర్గం ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసినా.. వారి కంటే ఎక్కువ ఓట్లతో సత్తా చాటుతోంది.

ఇక వచ్చే ఎన్నికలలో సీటు కోసం ఇప్పటి నుంచే ఈ ఇద్దరి నేతల మధ్య రగడ అయితే జరుగుతోంది. కరణంకు గతంలో గెలిచిన అద్దంకి ఆప్షన్ గా ఉంది. అయితే అక్కడ బాచిన ఫ్యామిలీ ఉంది. వారు ముందు నుంచి పార్టీ కోసం కష్టపడడంతో వాళ్లను వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఇటు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆమంచిని కూడా వదులుకునేందుకు అధిష్టానం సిద్ధంగా లేదు. కొద్ది రోజులుగా కరణంను ఆయన సామాజిక వర్గం అయిన కమ్మలు బలంగా ఉన్న పరుచూరుకు వెళ్లాలని వైసీపీ అధిష్టానం ఒత్తిడి చేస్తోంది.

ఇందుకు ఆయన ససేమీరా అంటున్నారు. మధ్యలో ఆమంచిని ఎమ్మెల్సీని చేసి పరుచూరుకు పంపితే ఎలా ? ఉంటుందా ? అన్న చర్చలు కూడా నడిచాయి. అయితే ఇప్పుడు కరణంకు ఇష్టం ఉన్నా లేకపోయినా సామాజిక సమీకరణల పరంగా అన్ని విధాలా ఆలోచించిన వైసీపీ అధిష్టానం చివరకు ఆయన్ను పరుచూరు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు వర్తమానం అందడంతో కరణంకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆయనకు ఫోన్ చేసి కంగ్రాట్స్ అండి.. మీరు పరుచూరులో పని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు టాక్ ?

Discussion about this post