ఈ మధ్య అధికార వైసీపీలో మంత్రి పదవి కోసం రేసులు ఎక్కువైపోయాయి. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దృష్టిలో పడి మంత్రి పదవి దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కించుకోవాలంటే ప్రజలకు ఎక్కువ సేవలు చేయాలి. తాము ప్రజలకు పూర్తిగా న్యాయం చేస్తామని రుజువు చేసుకోవాలి. ఇక అలాంటి వారికే పదవులు కూడా ఇవ్వాలి. కానీ అధికార వైసీపీలో ఇలాంటి పద్ధతులు లేవని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావాలి అంటే…చంద్రబాబుని తిట్టాలని, అప్పుడు వారికి మంత్రి పదవులు వస్తాయని మాట్లాడుతున్నారు. అంటే ఎంత ఎక్కువగా చంద్రబాబుని తిడితే, అంత ఎక్కువగా వారికి మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు అదే పనిలో ఉంటున్నారని, ఇప్పుడు తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా అదే పనిలో ఉన్నారని చెబుతున్నారు.

విశాఖ వైసీపీలో కీలక నాయకుడుగా ఉన్న గుడివాడ….చంద్రబాబు దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. యువ నాయకుడుగా టిడిపిలోనే పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయి, 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి, అప్పుడు టిడిపి నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్‌పై ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో గుడివాడ…అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచేశారు.

మరి ఎమ్మెల్యేగా గుడివాడ, అనకాపల్లి ప్రజలకు ఎంత అండగా ఉంటున్నారో తెలియదు గానీ, రాజకీయంగా జగన్‌కు అండగా ఉంటూ చంద్రబాబుపై మాత్రం విరుచుకుపడుతున్నారు. పైగా విశాఖలో మంత్రి పదవి కోసం అనేక మంది నాయకులు కాచుకుని కూర్చున్నారు. దీంతో గుడివాడ దూకుడు పెంచారు. తనదైన శైలిలో చంద్రబాబుని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వల్లే మంత్రి పదవులు వచ్చేలా కనిపిస్తున్నాయి.
Discussion about this post