వైసీపీ నుంచే ఎంపీగా గెలిచి…అదే పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టాలని జగన్ ప్రభుత్వం కిందా, మీదా పడుతుంది. చాలా కాలం నుంచి జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని రఘురామ ఎత్తిచూపిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కూర్చుని మరీ రఘురామ, ఏపీలో వైసీపీకి చుక్కలు చూపించేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు కంటే ఎక్కువగా రఘురామ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

దీంతో రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంది. ఆఖరికి రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టించింది. కానీ అది రివర్స్ అయ్యి వైసీపీకే నెగిటివ్ అయింది. జైలు నుంచి వచ్చాక రఘురామ…ఓ రేంజ్‌లో జగన్ ప్రభుత్వాన్ని ఆడేసుకుంటున్నారు. ఇలా తమకు తలనొప్పిగా మారిన రఘురామపై వేటు వేయించాలని ఢిల్లీలో వైసీపీ ఎంపీలు…ఎక్కిన గడప…దిగిన గడప అన్నట్లు తిరుగుతున్నారు.

ఇప్పటికే పలుమార్లు రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ స్పీకర్ మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. ఇక రఘురామ విషయంలో ప్రధాని మోడీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, హోమ్ మంత్రి అమిత్ షాకు ఇలా వరుసగా ఫిర్యాదులు చేసుకుంటూనే వెళుతున్నారు. వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పోరాడుతున్నారో లేదో తెలియదు గానీ, రఘురామపై వేటు వేయించడానికి నానా కష్టాలు పడుతున్నారు.

తాజాగా విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజును కలిసి, రఘురామపై వేటు వేయాలని కోరారు. ఈ విధంగా వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రుల చుట్టూ రౌండ్లు వేసేస్తున్నారు. కానీ రఘురామపై మాత్రం వేటు వేయించలేకపోతున్నారు. ఏదేమైనా రఘురామ, వైసీపీకి బాగానే చుక్కలు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.

Discussion about this post