వైసీపీ సర్కార్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మూడవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ ప్రభుత్వం రంగు రుచి వాసన అన్నవి అందరికీ తెలిసిపోయాయి. పంచుడు, దంచుడు విధానంగానే పాలన సాగుతోందని అర్ధమైంది. ఇక ప్రభుత్వ విధానాల మీద విపక్షాలు ఎటూ గట్టిగానే నోరు చేసుకుంటున్నాయి. ఇపుడు మావోయిస్టులు కూడా జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఏ మాత్రం ఉపయోగపడని ప్రభుత్వ విధానలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏజెన్సీలో గిరిజనులను మభ్యపెట్టే కార్యక్రమాలకు వైసీపీ తెర తీస్తోందని కూడా మావోలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించే విశాఖ జిల్లా నర్శీపట్నంలోని లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఒక విధంగా బాక్సైట్ తవ్వకాలకు ఇది ముందస్తు అనుమతి అని కూడా అనుమానిస్తున్నారు. గతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించమని వైసీపీ స్పష్టంగా ప్రకటించింది. కానీ ఇపుడు లేటరైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని వారు ఖండిస్తున్నారు. లేటరైట్ తవ్వకాల వల్ల నదీ నదాలకు ముప్పు ఉంటుందని, అవి కాలుష్యం అవుతాయని కూడా పర్యావరణవేత్తలు మరో వైపు హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా మావోలు గత కొంతకాలంగా ప్రభుత్వ నిర్బంధ విధానాలను ఎండగడుతున్నారు. ఈ మధ్యనే ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో ఆరుగురు మావోయిస్టులను ఎంకౌంటర్ చేశారు. దాంతో మావోలు సర్కార్ తీరు మీద గుర్రుమీద ఉన్నారు. అణువణువునా జల్లెడ పడుతున్న పోలీసుల తీరు మీద కూడా వారు మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో మావోల నుంచి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారం కూడా ఉంది. 2018లో అప్పటి టీడీపీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోలు హతమార్చారు.
ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కూడా కడతేర్చారు. దాంతో ఇపుడు అధికార వైసీపీ మంత్రులు నేతలు హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్యన తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి కన్నబాబుకు బులెట్ ప్రూఫ్ కారుని సమకూర్చింది ప్రభుత్వం, అలాగే గోదావరి జిల్లాలకు చెందిన మరో మంత్రికి కూడా తాజాగా బులెట్ ప్రూఫ్ కారు సదుపాయం అందించింది. ఇక విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉత్తరాంధ్రా మంత్రులు టార్గెట్ అవుతారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Discussion about this post