విజయనగరం జిల్లాలో పూసపాటి రాజులకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వారు దేశానికి ఎంతో చేశారు. వారికి ఇవ్వడమే తెలుసు. దాన ధర్మాల విషయంలో వారి తరువాతే ఎవరైనా అని చెబుతారు. ఉత్తరాంధ్రా మూడు జిల్లాల్లో వారు పలుకుబడి ఎనలేనిది. విశాఖలోని ఆంధ్రా విశ్వ విద్యాలయానికి నాడు పీవీజీ రాజు ఏకంగా ఆరువందల ఎకరాల విలువైన భూములు ఇచ్చి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మెప్పు పొందారు.
ఇక విద్యా దానాలకు రాజులు పెట్టింది పేరు. ఎంతో మంది విద్యావేత్తలుగా, సంగీత కళాకారులుగా ఆ రోజున నుంచి ఈ రోజుల వరకూ వెలుగొందారు అంటే అది పూసపాటి రాజుల చలవే. అటువంటి రాజ వంశీకుడు అయిన కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీద వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్న విమర్శలు మాటలు కూడా జనాల్లో చర్చకు వస్తున్నాయి.
రాజులను దొంగలు, దోషులు అంటూ అధికారం ఉందన్న గర్వంతో తీర్పులు ఇస్తూంటే మూడు జిల్లాల్లో జనం ఆగ్రహిస్తున్నారు. రాజులు దాచుకున్నది దోచుకున్నదీ ఏదీ లేదని వారే గట్టి బదులు ఇస్తున్నారు. మరో వైపు వైసీపీకి ఈ పరిణామాలు రాజకీయంగా దెబ్బ తీసేలా ఉన్నాయని కూడా అంటున్నారు. ఉత్తరాంధ్రా టీడీపీకి కంచుకోట. అటువంటి చోట జగన్ ఒక్క చాన్స్ అంటూ పాదయాత్ర వేళ అడిగారు కాబట్టి జనం ఓటేశారు. కానీ రెండేళ్ళు గడచినా అభివృద్ధి అంటూ లేకపోగా రాజకీయ దాడులు, విమర్శలు ఎక్కువ అయిపోయాయి అన్నది జనం మాటగా ఉంది.
విజయనగరం జిల్లా సహా మూడు జిల్లాలు గతంలో మాట ఎలా ఉన్నా తాజాగా మాత్రం కీలకమైన రాజకీయ మార్పు దిశగానే అడుగులు వేస్తున్నాయి. అశోక్ ని తప్పించి సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ ని చేశాక విజయనగరంలోని ఎమ్మార్ కాలేజీని ఎయిడెడ్ నుంచి అన్ ఎయిడెడ్ చేయడం, మాన్సాస్ ఆఫీస్ ని రాజు గారి కోట నుంచి మార్చేసి పద్మనాభం మండలంలో ఏర్పాటు చేయడం, మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం, సింహాచలంలో సక్రమ విధానాలను అనుసరించకపోవడం వంటివి అటు ఆస్తిక జనులతో పాటు, ఇటు చదువరులలో కూడా చర్చకు అవకాశం కల్పించాయి.
మరో వైపు ప్రత్యర్ధి పార్టీలపై ప్రతీకార దాడులు, భూ ఆక్రమణ ఆరోపణల పేరిట వేధింపులు వంటివి కూడా జనంలో ఉన్నాయి. వెనకబడిన విజయనగరం జిల్లా సహా శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేయాల్సి పోయి రాజకీయ ఆధిపత్యం కోసం వైసీపీ వేస్తున్న ఎత్తులతో జనాలు విసిగిపోతున్నారు. ఈ జిల్లాలలో నీటి పారుదల ప్రాజెక్టులకు తూతూ మంత్రంగా నిధులు బడ్జెట్ లో కేటాయించి ఊరుకున్నారు. ఇక రెండేళ్ళుగా పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
ఈ మొత్తం వ్యవహారాలతో పాటు మహారాజులను అన్న పాపం కూడా ఊరికే పోదని అంటున్నారు. సహజంగానే ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా ఉన్నాయి. అశోక్ సహా సీనియర్ నేతలు మళ్ళీ జోరు చేస్తున్న వేళ ఉత్తరాంధ్రాలో రానున్న రోజుల్లో సైకిల్ స్పీడ్ అందుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
Discussion about this post