తెలంగాణలోనూ రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్ తనయ షర్మిలకు ఆదిలోనే అష్ట కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్న షర్మిలకు వైఎస్ అభిమానులు దూరమవుతున్నారు. నిజానికి షర్మిల కానీ, జగన్ కానీ.. నమ్ముకున్నది వైఎస్ నే. ఆయన అభిమానులనే. ప్రజల్లో వైఎస్‌కు ఉన్న సెంటిమెంటునే! అయితే.. ఇప్పుడు ఈ విషయంలోనే షర్మిలకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిజానికి రాష్ట్ర విభజన సమయంలో జగన్ నేతృత్వంలో స్థాపించిన వైసీపీ ఉమ్మడి రాష్ట్రంలో బలంగానే ఉంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ పార్టీ విజయం దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో ఎంపీ సహా.. ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏపీకే పరిమితమయ్యారు. దీంతో తెలంగాణలో వైసీపీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో వైసీపీలోని తెలంగాణ నేతలు.. తమకు నచ్చిన పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే.. అప్పటికే కొంత మంది ఎటూ వెళ్లకుండా ఉన్నారు.ఇలాంటి వైఎస్ అభిమానులంతా కూడా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలని.. రాజన్న రాజ్యాన్ని స్థాపించా లని కోరుకున్నారు. ఆమె వెంటనడవాలని అనుకున్నారు. ముందుగా ఇలానే సాగింది. అయితే.. షర్మిల పొలిటికల్ ఎంట్రీ తర్వాత.. పరిస్థితి మారిపోయిందని.. వైఎస్ అభిమానులుగా ఉన్న తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. కేవలం డబ్బు, హంగు, ఆర్భాటం ఉన్న నాయకులకు మాత్రమే.. షర్మిల ప్రాధాన్యం ఇస్తున్నారని.. వారు ఆరోపిస్తున్నారు. ఆమె వెంటే ఉండేవారు.. నిజమైన వైఎస్ అభిమానులు కారని.. కూడా అంటున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలోని వైఎస్ అభిమానులంతా కూడా ప్రత్యేక కూటమి కట్టాలని నిర్ణయించుకున్న ట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. తొలుత ఈ సమస్యను వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ కు వివరించి.. తామే తెలంగాణలో వైసీపీని నడుపుకొనేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు .. షర్మిలకు ఆదిలోనే ఇంత పెడ్డ ఎఫెక్ట్ పడిందే! అని చర్చించుకోవడం గమనార్హం. మరి ఇదే కనుక జరిగి. వైఎస్ అభిమానులు పూర్తిగా షర్మిలను పక్కన పెడితే.. ఆమెపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Discussion about this post