షర్మిల కొత్త పార్టీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఉన్న పార్టీలు సరిపోవన్నట్టుగా .. తాను కూడా అధికారంలోకి వస్తానన్న అంచనాలు, ధీమాతో షర్మిల అక్కడ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టే కనిపిస్తోంది. కొత్త పార్టీ ప్రకటన రాకుండా… అసలు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏవీ లేకుండానే షర్మిల తన పార్టీ కోసం ఓ రాజకీయ వ్యూహకర్తను పెట్టేసుకున్నట్టు తెలుస్తోంది. అన్న ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకుని అధికారంలోకి వస్తే. ఇప్పుడు చెల్లెలు పీకే శిష్యురాలిని తన వ్యూహకర్తగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యూహకర్త పేరు ప్రియ. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్ర కుమార్తె. ఆమె తమిళనాడులో ఓ మీడియాకు అధిపతిగా కూడా ఉన్నారు.
గతంలో పలు రాష్ట్రాల ఎన్నికల కోసం పీకే బృందంలో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆ ప్రియను షర్మిల తన పార్టీకి వ్యూహకర్తగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఆలూ లేదు చూలూ లేదు… కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా షర్మిల కొత్త పార్టీ పరిస్థితి ఉంది. అసలు ఆ పార్టీలో పట్టుమని పేరున్న నాయకులు ఇద్దరు.. ముగ్గురు కూడా లేరు. ఇప్పటికే ఓ మీడియా ఛానెల్‌ను కొనేస్తున్నామని ఆ పార్టీ లీకులు ఇస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా ఓ వ్యూహకర్తను కూడా పెట్టుకుంటున్నట్ట సిగ్నల్స్ వస్తున్నాయి.
అన్నను అధికారంలోకి తెచ్చేందుకు పీకే ఏపీలో అనేక వర్గాల మధ్య చీలిక తెచ్చేందుకు నానా రకాలైన విష ప్రచారాలు చేశారన్న విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి. ఆ మాటకు వస్తే పీకే ఎక్కడ ఎన్నికల కోసం పనిచేసినా కూడా ఇదే తరహా స్ట్రాటజీలు అమలు చేస్తారని అంటారు. ఇప్పుడు మరి షర్మిల కోసం రంగంలోకి దిగుతోన్న ప్రియ షర్మిల పార్టీని తెలంగాణలో ఏ తీరాలకు చేరుస్తుందో ? చూడాలి. ఈ రోజు ఆమె లోటస్ పాండ్‌లో షర్మిలతో పార్టీ విధివిధానాలు, సోషల్ మీడియా వ్యవహారాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.
Discussion about this post