ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే చంద్రబాబు దెందులూరులో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు..అప్పటినుంచి ప్రతి చోటా విజయవంతంగా సాగుతుంది. బాబు రోడ్ షో, బహిరంగ సభలకు జనం నుంచి భారీ మద్ధతు వస్తుంది. ఇటీవల ఉమ్మడి కృష్ణాలో మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, ప్రకాశం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో బాబు కార్యక్రమం విజయవంతమైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బాబు పల్నాడు ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ నెల 26న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తారు. అయితే అన్నీ స్థానాలు వేరు..సత్తెనపల్లి వేరు అన్నట్లు ఉంది. ఎందుకంటే ఇక్కడ సీటు కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ చనిపోయారో..అప్పటినుంచి ఈ సీటు కోసం పోటీ పెరిగింది. కోడెల తనయుడు శివరాం..సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు. కానీ ఆయనపై టిడిపిలో కొన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సైతం ఈ సీటు ఆశిస్తున్నారు. ఇంకా ఒకరిద్దరు సైతం సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బిజేపి నుంచి టిడిపిలోకి రావడంతో సీన్ మారింది. సత్తెనపల్లిలో ఆయనకు రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో బాబు పర్యటనని దృష్టిలో పెట్టుకుని సత్తెనపల్లిలో కన్నా అనుచరులు భారీగా ఫ్లెక్సీలు కట్టారు.
దీంతో కన్నా సైతం సత్తెనపల్లిపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇక ఈ సీటు ఆయనకే దక్కే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈయన కాపు వర్గం..సత్తెనపల్లిలో కాపు వర్గానికి పట్టు ఉంది. దీంతో అక్కడ మంత్రి అంబటి రాంబాబుకు చెక్ పెట్టాలంటే కన్నాని బరిలో దింపితే బెటర్ అంటున్నారు. చూడాలి మరి సత్తెనపల్లి సీటు బాబు..ఎవరికి ఫిక్స్ చేస్తారో.