వైసీపీకి రాయలసీమలోనే కొంత వరకూ పట్టుంది. 2014 ఎన్నికలతో పాటు, 2019 ఎన్నికల్లోనూ విజయానికి రాయలసీమ వైసీపీకి బాగా సహకరించింది. జగన్ని రెండు సార్లు నమ్మిన సీమ జనం ఈసారి మాత్రం తామేంటో చూపిస్తారా అంటే జవాబు అవును అనే వస్తోంది. రాయలసీమలో మెల్లగా అధికార పార్టీ మీద వ్యతిరేకత చాప కింద నీరులా పెరిగిపోతోంది. సీమ నుంచి సీఎం అయిన జగన్ ఈ ప్రాంతానికి చేసిందేంటి అన్నది వారి ఆవేదనగా ఉంది. ముఖ్యంగా రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం శీత కన్ను వేస్తోందని అంటున్నారు. తాగేందుకు నీరు లేదు, సాగుకు అంతకంటే లేదు, మరో వైపు ఉపాధి లేక యువత అల్లల్లాడుతోంది.
సీమలో రియలెన్స్ కంపెనీ పరిశ్రమ పెట్టకుండా వెనక్కుపోవడం పట్ల యువత మండుతోంది. ఇది కచ్చితంగా సర్కార్ అసమర్ధతగానే వారు చూస్తున్నారు. మరో వైపు కొత్తగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు ఏవీ రాలేదు. రెండేళ్ళ పాటు ఓపిక పట్టి చూసిన యువత మాత్రం ఇపుడిపుడే జగన్ పాలన మీద గొంతు విప్పుతోంది. మరో వైపు చూస్తే రాయలసీమ ఎత్తి పోతల పధకం పేరిట హడావుడి తప్ప జరిగింది ఏమీ లేదు అన్న మాట ఉంది. ఈ విషయంలో లౌక్యంగా చేసుకోవాల్సిన వ్యవహారం కూడా బెడిసిందని దీంతో ఉన్నదీ ఉంచుకున్నదీ అన్నట్లుగా రెండూ పోయాయని మధన పడుతున్నారు.కేవలం నాలుగు టీఎంసీల నీరు కోసం అన్నట్లుగా చేసిన హడావుడితో పొరుగున ఉన్న తెలంగాణా ఏకంగా ఎనిమిది ప్రాజెక్టులను క్రిష్ణా నదికి అడ్డంగా కట్టేస్తే రాయలసీమ గతేం కానూ అన్నది రైతుల మనో వేదన. పాలనాపరంగా అనుభవ లేమి, లౌక్యం లేకపోవడం వలనే జగన్ సర్కార్ ఇలా బొక్క బోర్లా పడిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో అమరావతి రాజధానిని మార్చి విశాఖలో ఏర్పాటు చేయడాన్ని కూడా సీమ జనం తప్పుపడుతున్నారు. రాజధానిఉంటే అమరావతిలో ఉండాలి. లేకుంటే కర్నూల్ లో పెట్టడం న్యాయమని అంటున్నారు.
అలా కాకుండా విశాఖ అంటే తమకు ఏ విధంగానూ అక్కడకు వెళ్ళే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇలా జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం సీమకు వ్యతిరేకంగా ఉందని వారు మండుతున్నారు. మరి ఈ పరిణామాలు కనుక మును ముందు మరింతగా ముదిరితే మాత్రం సీమలో కచ్చితంగా పొలిటికల్ సీన్ మారుతుంది అంటున్నారు. అపుడు వైసీపీకి గట్టి దెబ్బ పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
Discussion about this post