రాజకీయాల్లో కష్టంతో పాటు కాస్త అదృష్టం ఉంటేనే నాయకులకు ఏదైనా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఒకోసారి ఎంత కష్టపడిన అదృష్టం లేకపోతే మాత్రం నాయకులకు గెలుపు కూడా దక్కదు. అలా అదృష్టం లేని నాయకుల్లో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి సోమిరెడ్డి, టిడిపిలో పనిచేసుకుంటూ వస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు.

అలాగే తన సొంత నియోజకవర్గం సర్వేపల్లి ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారు. కానీ సర్వేపల్లి ప్రజలే సోమిరెడ్డికి అండగా ఉండటం తగ్గించేశారు. 1994, 1999లలో మాత్రమే సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని గెలిపించారు. అప్పుడు సోమిరెడ్డి మంత్రిగా కూడా పనిచేసి, సర్వేపల్లిని అభివృద్ధి చేశారు. కానీ 2004 నుంచి రాజకీయం మారిపోయింది. అక్కడ నుంచి సోమిరెడ్డికి విజయం దక్కడం కష్టమైపోయింది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వచ్చారు. మధ్యలో బంపర్ ఆఫర్‌గా 2012 కొవ్వూరు ఉపఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు.ఇలా అయిదుసార్లు ఓడిపోయినా సరే సోమిరెడ్డి, సర్వేపల్లిని వదలలేదు. అక్కడే ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. అయితే 2014లో ఓడిపోయినా సరే చంద్రబాబు, సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే మంత్రిని కూడా చేశారు. మంత్రి అయ్యాక సోమిరెడ్డి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. కానీ సర్వేపల్లి ప్రజలు మాత్రం 2019లో సోమిరెడ్డిని మళ్ళీ ఓడించారు.

అయినా సరే సోమిరెడ్డి అక్కడే ఉంటూ పనిచేస్తున్నారు. అధికార వైసీపీపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అక్రమాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కష్టపడుతున్న సోమిరెడ్డికి నెక్స్ట్ ఎన్నికలే చివరి ఛాన్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఓడిపోతే సోమిరెడ్డి, ఈ సారి సర్వేపల్లికి దూరమయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మరి చూడాలి ఈ సారి సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని గెలిపించుకుంటారో లేదో?
Discussion about this post