జల్లి కట్టు ఉద్యమం ఒక స్పూర్తి. ఇప్పటికి దాదాపు నాలుగేళ్ళ క్రితం తమిళనాడు ప్రజలు అది చేసి చూపించారు. నాడు కూడా కేంద్రంలో ఉన్నది మొండి మోడీనే. తాను అన్న మాటకు తిరుగులేదనే తత్వం కలగిన నేతనే. కానీ. అరవవాళ్ళు అరచి గీ పెట్టారు. తమ సంప్రదాయ క్రీడను కాపాడుకున్నారు. తాము ఎంత పంతగాళ్ళమో లోకానికి చాటి చెప్పారు. తమ ముందు ఢిల్లీ ప్రభువుల ఏక పక్ష విధానాలు సాగవని తేల్చి చెప్పారు. నాడు జల్లి కట్టు ఉద్యమం చూసిన వారు అంతా ప్రత్యేక హోదా కోసం కూడా ఇలాగే పోరాడాలని కూడా అనుకున్నారు. కానీ అది జరగలేదు. పైగా దాని మీద నాటి టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎకసెక్కమాడారు జల్లి కట్టు కాకపోతే మరో పోరాటం చేసుకోండి కానీ హోదా అన్నది ముగిసిన అధ్యాయమే అని చెప్పేశారు. ఆయన ఏ ముహూర్తాన అన్నారో కానీ అది ముగిసిన అధ్యాయమే అయింది.
ఇపుడు చూస్తే మరో ముప్పు కొత్తగా వచ్చిపడింది. అదేంటి అంటే బంగారం లాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం. తీరి కూర్చుని ఏపీకే నవరత్నమైన భారీ ప్రభుత్వ రంగ సంస్థను ఎటూ కాకుండా కేంద్రం చేయడం అంటే నిజంగా దారుణమే. ఏపీ మీదనే వరసగా ఇలాంటి దాడులు జరుగుతూండడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. ప్రత్యేక హోదా పోయింది. విభజన హామీలు అసలు పట్టించుకోవడం లేదు. పోలవరం అలాగే ఉంది. రాజధాని ఊసే లేదు. మరిపుడు చూస్తే ఏకంగా ఘనమైన పరిశ్రమను అమ్మేస్తున్నారు. మరి దీని మీదనైనా ఆంధ్రులు అంతా కలసి వస్తారా. వారిలో ఇప్పటికైనా పౌరుషం వస్తుందా అంటే రావాలి అన్న మాట అయితే వినిపిస్తోంది. తమిళనాడు తరహాలో జల్లికట్టు ఉద్యమం లాంటి దాన్ని చేస్తే తప్ప కేంద్రం దిగిరాదు అని ఉక్కు కార్మిక సంఘాలు అంటున్నారు. ఈ విషయం తమ ఒక్కరిదే కాకుండా అంతా కలసి పంచుకోవాలని వారు కోరుతున్నారు. ఏపీ ప్రజనీకం అంతా ఒక్కటితేనే తప్ప స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోలేమన్న మాట కూడా ఉంది. మరి ఇప్పటికే ఆంధ్రులు కలసి రాకపోవడం వల్ల సమైక్య ఉద్యమం ఫెయిల్ అయింది అన్న విమర్శలు ఉన్నాయి.
ప్రత్యేక హోదా విషయంలో కూడా ఏపీ జనాలలో పట్టుదల కనిపించడంలేదు. మరి అన్నీ వదిలేసి ఎవరి మానాన వారు బతుకుతున్న ఆంధ్రులలో పౌరుషాగ్నిని రగిల్చేలా ఉక్కు సెగ తగులుతుందా అన్నదే చూడాలి. జల్లి కట్టు మాత్రమే కాదు ఏ సమస్య మీద అయినా తమిళనాడు అంతా ఒక్కటిగా ఉంటుంది.మరి మొదట్లోనే ఏ విషయంలోనూ ఏకం కాని ఆంధ్రుల నుంచి జల్లి కట్టు స్థాయి పోరాటాన్ని ఆశించడం దురాశే అవుతుందా. చూడాలి మరి.
Discussion about this post