ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏం మాట్లాడిన అది పెద్ద సంచలనమే అని చెప్పొచ్చు. ఆయన స్పీకర్ కుర్చీలో ఉన్నప్పుడు గానీ, తర్వాత నియోజకవర్గంలో ఉన్నపుడు గానీ స్పీకర్ గారి విమర్శలకు అడ్డు ఉండదు. సాధారణంగా స్పీకర్ చైర్‌లో ఉన్న వ్యక్తి, రాజకీయం మాట్లాడకూడదు. కానీ మన స్పీకర్ రాజకీయం మాట్లాడకుండా ఉండరు. అదేంటి అంటే ఇది మా రాజ్యం అనే విధంగా వారు ముందుకెళ్తారు.
దీంతో ఆయన ఏ మాట్లాడిన అదే హైలైట్ అవుతుంది. తాజాగా కూడా స్పీకర్ గారు చెట్లు ఆక్సిజన్ పీల్చుకుని, కార్బన్‌డైఆక్సైడ్ ఇస్తాయని చెప్పి అందరికీ జ్ఞానోదయం అయ్యేలా చేశారని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకున్నారు. గుసగుసలు ఏం కాదులే గానీ, బహిరంగంగానే స్పీకర్ మాటలని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. ఇలా స్పీకర్ మాట్లాడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అదే హాట్ టాపిక్ అయింది.ఇలా మాట్లాడి ప్రభుత్వం పరువుని స్పీకర్ కాస్త ఇబ్బంది పెట్టారని కథనాలు వచ్చాయి. దీంతో స్పీకర్ గారు కవర్ డ్రైవ్‌లు చేయడం మొదలుపెట్టారని తమ్ముళ్ళు అంటున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం 137 నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందని, మహాత్మాగాంధి, పూలే, అంబేడ్కర్ లాంటి మహాత్ముల కలలని జగన్ నిజం చేశారని స్పీకర్ మాట్లాడారు.
అయితే పెద్ద పీఠ ఎక్కడ వేశారో తెలియదు గానీ, నిధులు, విధులు సరిగ్గా లేని వాటిని బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చి, మంచిగా అధికారాలు ఉన్న పదవులని రెడ్డి వర్గానికి ఇచ్చుకున్నారని, ఇదేనా జగన్ మహాత్ముల కలలని నిజం చేయడమని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా స్పీకర్ ఏదో కవర్ చేసుకుబోయి, జగన్‌ని తీసుకుని మహాత్ముల పక్కనబెట్టడం ఎబ్బెట్టుగానే ఉందని అంటున్నారు.
Discussion about this post