తన్నీరు హరీష్ రావు అంటే కేసీఆర్ కి మారు పేరుగా ఉండే నేత. ఉద్యమ కాలంలో సొంత మేనమామ వెనకాల నిలిచి ఉద్యమాన్ని మరో మెట్టుకు ఎక్కించిన వాడు. మామకు కడు నమ్మకంగా ఉంటూ టీఆర్ఎస్‌లో బాగా ఎదిగిన నేత. అందుకే కేసీఆర్ ప్రేమగా తాను ఒకపుడు ప్రాతినిధ్యం వహించిన సిద్ధిపేటను హరీష్ రావుకు ఇచ్చేశారు. ఆలా మామ వారసుడిగా టీయారెస్ లో అడుగులు వేసిన హరీష్ కి సొంత బావ కేటీఆర్ నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ఎంతైనా పుత్ర ప్రేమ. కాదనలేని బలహీనత కేసీయార్ ది. సహజంగానే కుమారుడి ముందు మేనల్లుడు తక్కువే అయ్యాడు. కేటీఆర్ ఇటు ప్రభుత్వంలో నంబర్ టూ అటు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్. మరి హరీష్ రావు కుమలకుండా ఉండగలరా.

అయితే ఆయన తన బాధను ఎక్కడో ఒక చోట విప్పుకుని చెప్పుకోవాలిగా. అలా ఒకనాడు ఆయనకు దోస్త్ ఈటల రాజేందర్ ఊరట అయ్యారు. ఈటల హరీష్ కలసి ఎన్నో పంచుకున్నారు. టీఆర్ఎస్‌లో తమకు తగ్గిన విలువ, హెచ్చిన కేటీఆర్ ప్రాధాన్యత అన్నీ కూడా కలబోసుకున్నారుట. ఆ వివరాలు అన్నీ తన దగ్గర పదిలంగా ఉన్నాయంటున్నారు ఈటల రాజేందర్. ఇపుడు ఆయన వేరు పడిపోయారు. టీఆర్ఎస్ తో బంధాలను తెంచేసుకున్నారు. ఆయన సర్వ స్వతంత్రుడు. అందుకే ఆయన బయట ఉండి గట్టిగా గర్జిస్తున్నారు. హరీష్ నీవూ నేనూ చెప్పుకున్న ముచ్చట్లు, టీఆర్ఎస్ లో నీకు జరిగిన అవమానాలూ అవి నాకు చెప్పిన తీరు.. అన్నీ కూడా నా దగ్గర రికార్డెడ్ గానే ఉన్నాయని అంటున్నారు.

వాటిని సరైన సమయంలో తాను బయటపెడతాను అని కూడా అంటున్నారు. ఈలోగా కేసీఆర్, కేటీఆర్ ల కోసం తన మీద దూకుడుగా వస్తే మాత్రం బాగోదు అంటూ హరీష్ రావును హెచ్చరిస్తున్నారు. నిజానికి హరీష్ రావుకు టీఆర్ఎస్‌ను దాటి బయట చాలా మంది మిత్రులు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ పెద్దలు, ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే నిన్నటి టీఆర్ఎస్ నేస్తం ఈటల కూడా ఒకరు. మరి ఈటలను ఓడించడానికి కేసీఆర్ హరీష్ నే తెలివిగా ప్రయోగించారు.

హరీష్ ఇపుడు మామ పెట్టిన బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. మరో వైపు చూస్తే మిత్రుడి ఈటల మీదనే బాణాలు వదలాలి. హరీష్ గుట్లూ మట్లూ అన్నీ తెలిసిన ఈటల అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. మొత్తానికి చూస్తే మాత్రం ఈటల ఎపిసోడ్ లో బాగా బుక్కు అవుతున్నది హరీషే అంటున్నారు అంతా..!

Discussion about this post