తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లో చాలా నియోజకవర్గాలు ఆ పార్టీకి కంచుకోటలుగా ఉండేవి. కానీ తర్వాత తర్వాత పరిస్తితులు మారిపోతూ వచ్చాయి. కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయాయి. అలా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు మారిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం పరిస్తితి కూడా అంతే. పార్టీ పెట్టిన మొదట్లో అంటే 1983, 1985 ఎన్నికల్లో అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. ఇక 1989 ఎన్నికల్లో ఓటమి పాలైన సరే…1994, 1999 ఎన్నికల్లో కొత్తపేటలో మళ్ళీ టీడీపీ గెలిచింది.

ఇక అక్కడ నుంచి కొత్తపేటలో టీడీపీ జెండా ఎగరలేదు. 2004, 2009, 2014 2019 ఎన్నికల్లో కొత్తపేటలో టీడీపీ ఓటమి పాలైంది. అయితే టీడీపీ తరుపున 1994, 1999 ఎన్నికల్లో బండారు సత్యానందరావు విజయం సాధించారు. మధ్యలో ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్ళీ ఆయన టీడీపీలోకి వచ్చి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే రెండుసార్లు స్వల్ప మెజారిటీ తేడాతోనే ఓడిపోయారు.

వైసీపీ తరుపున చిర్ల జగ్గిరెడ్డి రెండుసార్లు తక్కువ మెజారిటీలతో బయటపడ్డారు. 2014లో 713 ఓట్ల మెజారిటీతో గెలవగా, 2019 ఎన్నికల్లో 4 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ సారి మాత్రం జగ్గిరెడ్డికి గెలుపు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి పనితీరుకు మంచి మార్కులేమి పడటం లేదు. ఈ రెండున్నర ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తక్కువే.

ఏదో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మినహా కొత్తపేట ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. అటు టీడీపీ నేత బండారు పుంజుకుంటున్నారు. రెండుసార్లు తక్కువ మెజారిటీలతో ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది. పైగా వైసీపీపై వ్యతిరేకత ఉంది. ఈ పరిణామాలని బట్టి చూస్తే ఈ సారి అంటే 2024 ఎన్నికల్లో కొత్తపేటలో టీడీపీ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

Discussion about this post