ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు. ఓడిపోవడానికి అది చిన్నా చితకా పార్టీ కాదు, పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయే అల్పాయుష్షు పార్టీ అంతకంటే కాదు. తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల మీద ఏర్పాటు అయింది. కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటికీ ఆ పార్టీతోనే ప్రయాణం చేస్తున్నాయి. పైగా నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ పార్టీకి ఉంది. మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడు టీడీపీకి సారధ్యం వహిస్తున్నారు. ఎన్నో యుద్ధాలను చూసిన విశేష అనుభవం ఆయన సొంతం. అటువంటి తెలుగుదేశం పార్టీ కొన్ని వ్యూహాత్మకమైన పొరపాట్ల కారణంగానే అధికారానికి దూరమైందని విశ్లేషకులు అంటారు.
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా కూడా ఓట్ల శాతం చూస్తే 38గా నమోదు అయింది. అంటే ఇది చాలా పెద్ద నంబర్. ఏపీలో ఇంతటి స్థాయిలో మరో విపక్ష పార్టీకి ఓటర్ల మద్దతు లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎపుడు ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా టీడీపీకి సీట్లు తగ్గాయే కానీ ఓట్ల షేర్ మాత్రం తగ్గలేదు. ఒక రాజకీయ పార్టీ మనుగడను అలా కొలమానం వేసుకుంటే కనుక టీడీపీ ఇప్పటికీ ఏపీలో బలమైన పార్టీ. పైగా గాలివాటంగా ఒకసారి గెలిచి పక్కకు జరిగిపోయే పార్టీ అంత కంటే కాదు. ఇక ఏపీలోని పదమూడు జిల్లాల్లోని ప్రతీ పోలింగ్ బూత్ లోనూ టీడీపీకి కచ్చితమైన ఓటు బ్యాంక్ ఉంది. ప్రతీ పల్లెల్లో టీడీపీకి పడే ఓట్లు మరో పార్టీకి ససేమిరా పడవు. అంతటి అభిమానం ఆ పార్టీ సొంతం.ఇక టీడీపీకి మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే క్యాడర్. ఆ పార్టీకి ఉన్న అంకితభావం కలిగిన కార్యకర్తలు దేశంలో మరే పార్టీకి లేరు. దాంతోనే టీడీపీ నాయకులు ఫిరాయించినా ఇన్నేళ్ళ పాటు నెట్టుకువచ్చింది. ఈ రోజు మిగిలిన పార్టీలోని నాయకులు ఎవరైనా ఒకనాడు టీడీపీలో పుట్టి పెరిగిన వారే. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ లీడర్లను తయారు చేసే కర్మాగారంగా చెప్పుకోవాలి. అందువల్లనే టీడీపీ 2024లో గెలిచి తీరుతుందని ఆ పార్టీకే కాదు, అభిమానులకు గట్టి నమ్మకం ఉంది. ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమం అన్న పప్పు బెల్లాల కార్యక్రమం కాస్తా రేపటి రోజున అప్పులు పుట్టకపోతే పూర్తిగా ఆగిపోతుంది. రెండేళ్ళ పాటు సాగిన ఈ పంచుడు కార్యక్రమానికి మూడవ ఏట నుంచి మూడే సీన్ కనిపిస్తోంది. దానికి తోడు అనేక ప్రజా సమస్యలు ఈ రోజుకూ పరిష్కారం లేదు.
వైసీపీ ఏలుబడిలో ఏపీకి రాజధాని ఈ రోజుకూ లేదని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అతీ గతీ చూస్తే అలాగే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు తీయడం అన్నది అసలు జరగడమే లేదు. ఇవన్నీ కలసి వైసీపీ మీద జనాలకు తీవ్ర వ్యతిరేకతను పెంచే అవకాశాలు ఉన్నాయి. దాంతో అందిపుచ్చుకునేందుకు టీడీపీ రెడీగా ఉంది. ఈ మధ్యన విశాఖ జిల్లా నాయకులతో టీడీపీ అధినాయకత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆరు నూరు అయినా వచ్చేది మన ప్రభుత్వమే. అందరికీ న్యాయం తప్పకుండా చేస్తామని భరోసా ఇచ్చింది. దాని అర్ధం ఏంటి అంటే 2024లో గ్యారంటీగా ఏపీలో పసుపు జెండా ఎగిరి తీరుతుందనే.
Discussion about this post