“నేతలను ఎలా కాపాడుకోవాలి?“.. ఇదీ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్న పెద్ద సవాల్. నిన్న మొన్నటి వరకు ఆయన పార్టీని ఎలా కాపాడుకోవాలి? అనే తర్జన భర్జన పడ్డారు. కానీ, ఇప్పుడు నేతలు టార్గెట్‌గా వైసీపీ చేస్తున్న దూకుడు రాజకీయం .. పార్టీతోపాటు..నేతలను కూడా ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈక్రమంలో చంద్రబాబు ఇప్పుడు పార్టీని.. అంతకుమించి నేతలను కూడా కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఏర్పడుతోంది. నిజానికి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ.. ఏర్పడలేదని అంటున్నారు పరిశీలకులు. తనకు బద్ధ శత్రువైన.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురు కాలేదు.

అదే సమయంలో పార్టీని టార్గెట్ చేశారే తప్ప.. ఇలా.. నేతలను టార్గెట్ చేసిన నాయకులు.. మాత్రం చంద్రబాబుకు ఎదురు కాలేదు. గత ఏడాదిలో దాదాపు ఐదుగురు నేతలను అందునా ప్రజాబలం ఉన్న నాయకులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. శ్రీకా కుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అనంతపురానికి చెందిన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన బీటెక్ రవి.. ఇప్పుడు తాజాగా కృష్నాజిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేయడం.. జగన్ ప్రభుత్వం చేస్తున్న దూకుడుగా టీడీపీ భావిస్తోంది.

ఇక, రాబోయే రోజుల్లో మరెంతమందిని టార్గెట్ చేస్తారో.. అనే భయం వెంటాడుతూనే ఉంది. ఈక్రమంలో కీలకనేతలకే పార్టీ నుంచి రక్షణ కల్పించకపోతే.. కేడర్‌లో ఆత్మ స్థయిర్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని.. సీనియర్లు చెబుతున్నారు. ఇది.. పార్టీని వచ్చే మూడేళ్లపాటు ప్రజల్లో నిలబెట్టేందుకు ఇబ్బందులు వచ్చేలా చేస్తుందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ముందు నేతలను రక్షించుకునే మార్గంపై దృష్టి పెట్టాలని..త ద్వారా కేడర్‌లో ఆత్మ స్థయిర్యం కోల్పోకుండా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని.. చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. నిజానికి ఆయన ఈ పని.. అచ్చెన్నాయుడు.. విషయం తెరమీదకి వచ్చినప్పుడే చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు.
సరే.. ఇప్పటికైనా.. ఈ విషయంపై దృష్టి పెట్టడం మంచిదేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పుడు నేతలను ఎలా కాపాడుకోవాలి? ఏ విధంగా జగన్ సర్కారుపై ఏవిధంగా పైచేయి సాధించాలనే విషయంపై చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం లేదు. దీంతో న్యాయపరంగా.. ముందు జగన్ సర్కారును కట్టడి చేసే యోచనలో ఉన్నారని తాజాగా నిర్వహించిన సీనియర్‌ల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. నేతలకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించనున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు పార్టీ కంటే ముందు నేతలను కాపాడుకోవడం.. చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు.

Discussion about this post