ఏపీలో అధికార వైసీపీలో వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టిక్కెట్లు దక్కవు అన్నది వాస్తవం. అధికార పార్టీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో కనీసం 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి – ఆదాల ప్రభాకర్ రెడ్డి – గోరంట్ల మాధవ్ – నందిగం సురేష్ – చింతా అనురాధ – డాక్టర్ సత్యవతి లాంటి ఎంపీకు తిరిగి టిక్కెట్లు వచ్చే పరిస్థితి లేదు. మరికొందరు ఎంపీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని కూడా వైసిపి వర్గాలే చెబుతున్నాయి. ఇక జగన్ కాన్సన్ట్రేషన్ అంతా ఎంపీ సీట్ల మీద లేదు… కేవలం అసెంబ్లీ సీట్లు ఆయన టార్గెట్. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలి అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పక్కనపెట్టేసి… వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు.

సెంటిమెంట్‌తో ఎమ్మెల్యేగా గెలుపు…
బెంగాల్లో ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి తిరిగి మూడో సారి మమతాబెనర్జీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఏపీ లో వచ్చే ఎన్నికల్లో జగన్‌తో అదే ప్లాన్ అమలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి గుంటూరు జిల్లాలో కొందరు వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కచ్చితంగా టిక్కెట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ లిస్టులో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం నుంచి వినుకొండలో ఒకసారి…. వైసీపీ నుంచి పెదకూరపాడు లో మరోసారి ఓడిన బ్రహ్మనాయుడు గత ఎన్నికల్లో రెండు ఓటముల సెంటిమెంట్‌తో పాటు జగన్ ప్రభంజనంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే అయ్యారు.
బ్రహ్మనాయుడు అసలు ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతారా ? అన్న సందేహం వినుకొండ ప్రజలకు ఉండేది. అలాంటిది జగన్ ప్రభంజనంతో పాటు రెండు వరుస ఓటముల సెంటిమెంట్లు కలిసి వచ్చి లక్కుతో ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కారు.

ఎంపీ లావుతో పొసగని వైనం…
బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినప్పటినుంచి నియోజకవర్గంలో సొంత పార్టీ క్యాడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయన హయాంలో అవినీతి ఎక్కువైందని… కనీసం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదని వైసిపి వారు వాపోతున్నారు. పల్నాడులో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన వినుకొండలో గత రెండున్నర సంవత్సరాలలో రహదారులు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. పలుచోట్ల నియోజకవర్గ ప్రజలు తాగునీటికి సైతం కటకటాలాడాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో బొల్లాకు ఏ మాత్రం పొసగటం లేదు. ఎంపీ లావు కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లాతో సంబంధం లేకుండా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే గత ఎన్నికలకు ముందు ఎంపీ లావు పట్టుబట్టి మరి నియోజకవర్గంలో మంచి కేడర్ ఉన్న మల్లికార్జునరావును వైసీపీలోకి తీసుకు వచ్చారు.


జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటమి పెద్ద ఎదురు దెబ్బే ..!
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బొల్లా గెలుపు కోసం మక్కెనఎంతో కష్టపడ్డారు. ఇంకా చెప్పాలంటే బొల్లాకు ఇంత మెజార్టీ రావటానికి మక్కెన ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. అసలే అంతంత మాత్రంగా ఉన్నా బొల్లా పనితీరుకు ఇటీవల జరిగిన శావల్యాపురం జడ్పిటిసి ఉప ఎన్నిక మరిన్ని మైనస్ మార్కులు జత చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన పారా హైమావతి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. విచిత్రమేంటంటే ఈ జడ్పిటిసి ఉప ఎన్నిక ఎమ్మెల్యే బొల్లా వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జీవి మధ్య పోరు అన్నట్టుగా నడిచింది. ఎమ్మెల్యే బొల్లా అయితే ఇది మన ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం అని సవాలు చేసి మరీ జీవిని కవ్వించారు. అయితే ఈ ఎన్నికల్లో బొల్లా పరోక్షంగా ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికపై వైసిపి అధిష్టానం సైతం ప్రత్యేకంగా ఆరా తీయడంతో పాటు బొల్లా పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

వచ్చే ఎన్నికల్లో సీటు మక్కెనదే…
ఇటీవల రైతు నరేంద్ర ఇష్యూలో ఎంపీ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం కూడా ఎమ్మెల్యేకు చాలా మైనస్ అయ్యింది. ఇక వచ్చే ఎన్నికల్లో బొల్లాకు సీటు ఇస్తే వినుకొండలో మరోసారి పార్టీ గెలిచే పరిస్థితి లేదని నివేదికలు కూడా అధిష్టానానికి చేరాయని భోగట్టా ? ఈ క్రమంలో ఈసారి వినుకొండ వైసిపి టికెట్ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకు ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చినా మక్కెనకు వైసిపి అధిష్టానం ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఆయనకు మరే పదవులు వచ్చే అవకాశం కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్న పార్టీ అధినేత జగన్ మక్కెనకు ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వలేదని అంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర సంవత్సరాలలోనే బొల్లా సీన్ పూర్తిగా రివర్స్ అయిందని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Discussion about this post