గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం అంటేనే.. టీడీపీకి ఆమడదూరం అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే.. ఎప్పుడో.. 1999 తర్వాత.. అక్కడ టీడీపీ ఎప్పుడు గెలవలేదు. కాంగ్రెస్ జోరులో కొన్నాళ్లు.. వైఎస్ హయాంలో మరికొన్నాళ్లు.. ఇక, వైసీపీ దూకుడుతో ఇప్పటి వరకు పాగా వేయలేకపోయింది టీడీపీ. ఎప్పటికప్పుడు ఓటములు మూటగట్టుకుంటూ.. పార్టీ గ్రాఫ్ దిగజారిపోతూ వచ్చింది. వైసీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వరుసగా రెండుసార్లు బాపట్లలో విజయం సాధించారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ అధిష్టానం సైతం ఇక్కడ రెండు దశాబ్దాలలో సరైన నాయకుడిని సెట్ చేయలేకపోయింది.

అయితే.. ఇప్పుడు ఇలాంటి సందిగ్ధ, ఇబ్బందికర పరిస్థితిని పక్కన పెట్టి.. టీడీపీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ బాపట్ల నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న వేగేశ్న నరేంద్ర వర్మ. గడిచిన ఐదారేళ్లుగా ఆయన క్రియాశీలంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. తనకు పార్టీ ఏమిచ్చింది? అనే మాటలను పక్కన పెట్టి.. మరీ.. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ ప్రతి గ్రామంలోనూ.. పర్యటించి.. ప్రజలకు ప్రభుత్వ ఫలాలు చేరువ చేయడంలో ముందున్నారు. ఇక, తన స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా అనేక సేవలు అందిస్తున్నారు.

గత ఎన్నికలకు ముందే ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజల్లోకి వెళ్లారు. చివర్లో సమీకరణలు మారడంతో చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వకపోయినా టీడీపీ విజయం కోసం ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు పార్టీని వదిలేయడంతో చంద్రబాబు వేగేశ్న సేవలను గుర్తించి.. నియోజకవర్గం బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇక, అప్పటినుంచి ప్రతి మండలంలోనూ.. పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి.. కార్యకర్తలకు ప్రజలకు మరింత చేరువ అయ్యారు. పిట్టలవాని పాలెం, కర్లపాలెం, బాపట్ల మండలాల్లో.. పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి.. వారంలో ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి.. కార్యకర్తలను బలోపేతం చేస్తున్నారు.

అక్రమ పోలీసు కేసులపై కూడా కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. దీంతో రెండున్నర దశాబ్దాల్లో లేని కొత్త ఉత్తేజం.. పార్టీలో కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ అధినేత చంద్రబాబు ఇస్తున్న పిలుపు మేరకు నరేంద్ర వర్మ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూనే.. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలోనూ కీలక రోల్ పోషిస్తున్నారు. దీంతో బాపట్లలో టీడీపీ పుంజుకుందని అంటున్నారు పార్టీ సీనియర్లు కూడా. ఇదే దూకుడు. వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తే.. వేగేశ్నకు తిరుగులేదని చెబుతున్నారు. ఇదే జరిగితే.. బాపట్లలో పాతిక సంవత్సరాల తర్వాత.. తిరిగి సైకిల్‌కు కొత్త ఊపిరి వస్తోంది.

Discussion about this post