సరిగ్గా 2024 వస్తే తిరువూరులో టీడీపీ గెలిచి 25 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో అక్కడ టిడిపి చివరిసారిగా గెలిచింది. 1983 నుంచి 1999 వరకు మంచిగానే విజయాలు సాధించింది. ఆ 99 నుంచి సీన్ మారుతూ వచ్చింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా టిడిపి అక్కడ గెలవలేదు. మళ్ళీ గెలుస్తుందనే ఆశ కూడా కనిపించడం లేదు.
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అంటే వరుసగా నాలుగుసార్లు టిడిపి ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో అభ్యర్ధిని మార్చిన టిడిపికి ప్రయోజనం లేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి నల్లగట్ల స్వామీదాసు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలో ఆయన్ని పక్కన పెట్టి, కేఎస్ జవహర్‌ని నిలబెట్టారు. అయినా సరే టిడిపి గెలవలేదు. ఓడిపోయాక జవహర్ మళ్ళీ తన సొంత స్థానం కొవ్వూరుకు వెళ్ళిపోయారు.

దీంతో కొన్ని రోజులు తిరువూరులో టిడిపిని నడిపించే నాయకుడు లేరు. ఆ తర్వాత ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన దేవదత్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇక్కడ వైసీపీపై వ్యతిరేకత స్పష్టంగా ఉంది. రెండుసార్లు గెలిచిన రక్షణనిధిపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక్కడ అభివృద్ధి పెద్దగా లేదు. పైగా అక్రమాలు ఎక్కువనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి.
దీంతో తిరువూరులో టిడిపికి కాస్త ప్లస్ అవుతుంది. అలా అని టిడిపి పక్కాగా గెలిచేస్తుందని చెప్పడానికి లేదు. టిడిపిలో కూడా గ్రూపు తగాదాలు కనిపిస్తున్నాయి. సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. నేతలు ఎవరు వ్యూహాత్మకంగా వెళ్ళడం లేదు. దీని వల్ల టిడిపికి తిరువూరులో గెలుపు కాస్త కష్టమయ్యేలా ఉంది. కానీ ఇకనుంచైనా వ్యూహాత్మకంగా వెళితే తిరువూరులో పసుపు జెండా ఎగురుతుంది.
