మరో నాలుగు రోజుల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆవిర్భవించి.. 40 వసంతాలు పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పార్టిని ఎలా ముందుకు నడిపించాలి? వచ్చే ఎన్నికల్లో పార్టీ ని ఏవిధంగా అధికారంలోకి తీసుకురావలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తారా? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలను ముందుకు తీసుకువస్తారు? అనే చర్చ పార్టీలో జోరుగాసాగుతోంది. నిజానికి ఇప్పటి వరకు పార్టీలో జరిగి మహానాడుకు ప్రాధాన్యం ఉంది. ప్రతిఏటా మేలో జరిగే.. మహానాడు పార్టీకి ఒక `పసుపు పండుగ`. భారీ ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఉంది.

అన్నగారి హయాం నుంచి కూడా మహానాడుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. నిర్వహిస్తున్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ హజరు కావడం.. పార్టీపై తమ విజన్‌ను వెల్లడించడం అనేవి.. తెలిసిందే. అయితే.. కొన్నేళ్లుగా మహానాడు ప్రహసనంగా మారిందనే వాదన వినిపిస్తోంది. కేవలం మహానాడు వేదికగా.. చంద్రబాబును, ఆయన విజన్‌ను కొనియాడడం.. పాలనను మెచ్చుకోవడం వరకే పరిమితమవుతున్న పరిస్థితి ఉంది. కానీ, ఇప్పటికీ.. క్షేత్రస్తాయిలో కొన్ని చోట్ల పార్టీ బలపడని విషయం.. పొత్తులు లేకుండా పార్టీ పుంజుకునే విషయాలపై మాత్రం అధినాయకత్వం దృష్టి సారించడం లేదనే అపవాదు సర్వత్రా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ అభిమానులుకూడా దీనిని జీర్నించుకోలేక పోతున్నారు.

ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు.. మహానాడు విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నవారు.. నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో తాజాగా జరగనున్న 40 వసంతాల వేడుకలో అయినా.. రాబోయే 10 సంవత్సరాలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయాలని .. తమ్ముళ్లు కోరుతున్నారు. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా.. అన్ని సామాజిక వర్గాలను పార్టీవైపు ఆకర్సించేలా.. ఏదైనా చేయాలని వారు కోరుతున్నారు.

అదేవిధంగా గతంలో అన్నగారు.. నాయకులను సామాన్యుల నుంచి ఎన్నుకునేవారు. కానీ, ఇటీవల ఈ సంస్కృతి పోయి.. వారసులను ఎంచుకునే పరిస్తితి కొనసాగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్ననాయకులు.. కార్యకర్తలకు అవకాశాలు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అయినా.. మళ్లీ సామాన్యుల నుంచి అసామాన్యులను ఎంచుకునే దిశగా చంద్రబాబు ఎలాంటి వ్యూహం రచిస్తారో.. చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కార్యకర్తల ఆకాంక్షలు, అభిప్రాయల మేరకు చంద్రబాబు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

Discussion about this post