గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు కీలక నేతలు జారిపోయారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఇన్‌ఛార్జులు లేకుండా పోయారు. ఇప్పుడిప్పుడే ఒక్కో నియోజకవర్గ ఇన్చార్జి పదవి భర్తీ చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు పార్టీ కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు అన్నదానిపై పెద్ద సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం కొవ్వూరు, చింతలపూడి రిజర్వుడ్ నియోజక వర్గాలకు ఇన్చార్జిలు ఎవరూ లేరు. కొవ్వూరు ఇన్చార్జి పదవిని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆశిస్తున్నారు. ఆయన రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

జవహర్‌ను చంద్రబాబు ఎలాగూ వదులుకోరు. అయితే ఆయనకి కొవ్వూరు టికెట్ ఇస్తారా ? లేదా మరో నియోజకవర్గానికి ఆయన పేరు పరిశీలిస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక గోపాలపురం నుంచి గత ఎన్నికల్లో ఓడినా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఇంఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే ఆయన సీటు కోసం చివరి వరకు పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రోగ్రాం కమిటీ ఇన్చార్జిగా ఉన్న మద్దిపాటి వెంకట రాజు 2019లో చివరివరకూ గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఈసారి మద్దిపాటి పార్టీలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు. దీంతో ఈసారి ముప్పిడికి సులువుగా సీటు వచ్చేస్తుంది… వస్తుంది అనుకోవటానికి వీల్లేదు. గోపాలపురం సీటు విషయంలో చివర్లో సమీకరణలు ఎలాగైనా తారుమారు కావొచ్చు.


ఇక మరో రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన చింతలపూడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కర్రా రాజారావు మృతి చెందడంతో అక్కడకూడా పార్టీ ఇన్చార్జిగా ఎవరూ లేరు. చింతలపూడి పార్టీ టిక్కెట్ కోసం మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు , మాజీ జడ్పీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆకుమర్తి రామారావు ప్రధానంగా పోటీ పడుతున్నారు. తెలుగుదేశం ముందు నుంచి జిల్లాలో మూడు రిజర్వుడు సీట్లలో రెండు మాదిగ సామాజిక వర్గానికి ఒకటి మాల సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఇదే సూత్రం పాటిస్తుందా ? లేదా మూడు సీట్లు మాదిగలకే ఇస్తారా అన్నది కూడా చూడాలి.



తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లు మాల సామాజిక వర్గానికి కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. గుంటూరు సీట్లు మాలలకే ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒకటి మాలకు, మరొకటి మాదిగకు ఇస్తున్నారు. ఇక మాదిగ సామాజిక వర్గం ఓటు బ్యాంకు జిల్లాలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఈసారి సరికొత్త ప్రయోగం చేస్తే మూడు సీట్లు మాదిగ వర్గానికి ఇవ్వొచ్చు… లేదా ఒక సీటు మాలలకు కేటాయించాల్సి వస్తే అది చింతలపూడి, కొవ్వూరులో ఏది అవుతుంది అన్నది కూడా చూడాలి. ప్రస్తుతం ఈ మూడు సీట్లకు 6గురు కీలక నేతలు పోటీపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Discussion about this post