టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కదలిక కనిపించినా.. ఒక్క ప్రకాశం జిల్లా మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడి టీడీపీ నాయకులు గతానికి భిన్నంగా స్పందించారు. ప్రతిఒక్కరూ కదిలారనే చెప్పాలి. పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక రేంజ్‌లో దూకుడు ప్రదర్శిస్తే.. మిగిలిన నాయకులు.. గత ఎన్నికల్లో పరాజయం పాలై.. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న నేతలు కూడా చంద్రబాబు దీక్షకు కదలి వచ్చారు. నిజానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకు సంబంధించిన సమస్యలపై సీఎంకు లేఖలు రాయటం, జిల్లాలో పార్టీశ్రేణుల మొత్తాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లటంలాంటి చర్యలకు జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, విజయవాడలో ఆ పార్టీ నాయకుడు పట్టాభి ఇల్లు ధ్వంసం, రాష్ట్రంలోని మరికొన్నిచోట్ల కార్యాలయాలపై దాడులు చేయటం మొత్తం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఈ ఘటనపై స్థానిక ముఖ్యనేతల ప్రమేయంతోపాటు స్వచ్ఛందంగానే టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ నిరసన చేపట్టారు. పోలీసుల హెచ్చరికలు, అరెస్టులు, నిర్భంధాలను పట్టించుకోకుండా రోడ్డెక్కి బంద్‌లు చేశారు. చంద్రబాబునాయుడు దీక్ష చేస్తుంటే జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి మద్దతు పలికారు. ముందురోజు రాత్రికే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే స్వామి తదితరులు వెళ్లి బాబు నివాసంలో పడుకుని ఆయనతోపాటు దీక్షా శిబిరానికి చేరు కున్నారు.

అద్దంకి ఎమ్మెల్యే రవికు మార్ 300 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లి మంగళగిరిలోనే మకాం వేశారు. వీరితో పాటు ఆ పార్టీ ఇన్ చార్జ్‌లు అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఎరిక్షన్ బాబు, దామచర్ల జనార్దన్, పమిడి రమేష్, బీఎన్ విజయకుమార్, నాయకులు నూకసాని బాలాజీ, దివి శివరాం, దామచర్ల సత్యలు శిబిరం వద్దకు చేరి అక్కడ ముఖ్యపాత్ర పోషించారు. డెంగ్యూ జ్వరంతో ఉన్న ఉగ్రనరసింహారెడ్డి ఒక్కరే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లాలోని ప్రతి ఊరి నుంచి టీడీపీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ మొత్తం కార్యక్రమంలో నాయకులు ముందుండి వాహనాలు ఏర్పాటు చేయటమో, పది రూపాయలు డబ్బులిచ్చి రమ్మని పిలవటమో జరిగిన దాఖలాలు లేవు.



అంతేకాదు.. నిన్న మొన్నటివరకు అధికారపార్టీతో ఎందుకన్నట్లు నోరు మెదపకుండా సర్దుకు పోతున్న నాయకులంతా నోరు తెరిచి వైసీపీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సహనంతో అన్నీ భరించామని.. ఇప్పుడు ఇక, సహనం నశించిందని నాయకులు చెప్పడం గమనార్హం. ఈ పరిణామాలు టీడీపీలో జోష్ పెంచుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే తరహా వ్యూహంతో నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు కదిలితే.. టీడీపీ గెలుపు పెద్ద సమస్య కాదని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. చంద్రబాబు దీక్ష పార్టీలో కొత్త ఊపు తీసుకువచ్చిందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

Discussion about this post