ప్రముఖ పారిశ్రామిక వేత్త.. టీడీపీ నాయకుడు వేగేశ్న నరేంద్ర వర్మపై ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. గుంటూరు జిల్లా టీడీపీలో ఆయన స్టయిల్ వేరు. పార్టీ అధినేత చంద్రబాబు క్రమశిక్షణ స్టైల్లో పనిచేస్తున్న అతి తక్కువ మందినేతల్లో ఈయన ఒకరు. పార్టీ ఆదేశాలకు అనుకూలంగా ప్రజల్లోకి వెళ్లడం.. వారి కష్టాలు తెలుసుకోవడం.. పార్టీని ప్రమోట్ చేయడం వర్మకు గత కొన్నేళ్లుగా అలవాటుగా మారింది. గత ఐదారేళ్లుగా వర్మ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లోనే గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయితే.. అప్పట్లో ఇది దక్కలేదు. అయితే.. తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో వర్మకు చంద్రబాబు బాపట్ల ఇంచార్జ్ పదవిని అప్పగించారు.

ఇక, అప్పటి నుంచి పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉంటున్నారు. బాపట్లలోని ప్రతి మండల కేంద్రంలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని.. ప్రజలకు మరింత చేరువ అయ్యారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయనపై పార్టీ పరంగా మరింత బాధ్యత పడింది. బాపట్లను ఇప్పుడు జిల్లాగా ప్రకటించారు. సహజంగా జిల్లా కేంద్రం కావడంతో ఇప్పుడు జిల్లా అటెన్షన్ అంతా బాపట్ల మీదే ఉంటుంది.

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలను కలుపుతూ.. బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇక్కడ పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈయనపై ఉంది. పైగా రేపల్లె, వేమూరు, అద్దంకి, పరుచూరు వంటివి.. టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. రేపల్లె, చీరాల, అద్దంకి, పరుచూరులో గత ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకుని మరీ.. టీడీపీ విజయం దక్కించుకుంది.

ఇక, బాపట్లలో వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకుంటే… అది ఖచ్చితంగా కొత్తగా ఏర్పడే జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. దీనికి వేగేశ్న నరేంద్ర వర్మ కృషి అత్యంత కీలకం కానుంది. కొత్త జిల్లా కేంద్రంలో పార్టీ విజయం దక్కించుకుంటే.. ఖచ్చితంగా ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బాపట్లలో టీడీపీ గెలిచి 20 ఏళ్లు అయ్యింది. పైగా ఇక్కడ వైసీపీ నుంచి రెండుసార్లు గెలిచిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని ఓడించి వర్మ టీడీపీ జెండా ఎగరవేయాలి. వచ్చే ఎన్నికలకు కేవలం 24 నెలలు మాత్రమే ఉండడంతో వేగేశ్న ఇదే జోరు కొనసాగిస్తే జిల్లా కేంద్రంలో టీడీపీ జెండా ఎగరడం ఈ సారి పెద్ద కష్టం కాదు.

Discussion about this post