ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలాపురం నియోజకవర్గం..తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొదట నుంచి ఇక్కడ టిడిపి హవా నడుస్తూనే ఉంది. 1983 నుంచి 1999 వరకు ఇక్కడ టిడిపి హవా నడిచింది. వరుసగా ఐదు ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఇక 2004లో ఓటమి పాలవ్వగా, మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఓడిపోయింది.
మొత్తం మీద ఇక్కడ టిడిపి 7 సార్లు గెలిచింది..అంటే గోపాలాపురంలో టిడిపికి బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి గోపాలాపురంలో ఖచ్చితంగా గెలవాలనే కసితో టిడిపి శ్రేణులు పనిచేస్తున్నాయి. అటు వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈయన్ని 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రయోజనం శూన్యం. ఏ మాత్రం ప్రజలకు సేవ చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రజా సమస్యలు పట్టించుకున్నది లేదు. పైగా ఇక్కడ అక్రమాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో ఎమ్మెల్యేపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ఇది టిడిపికి కలిసి రావచ్చు. అయితే ఇక్కడ టిడిపిలో నాయకత్వ మార్పు జరిగింది. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని తప్పించి యువనేత మద్దిపాటి వెంకటరాజుని ఇంచార్జ్ గా పెట్టారు. ఇంచార్జ్ గా మద్దిపాటి దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రతి ఇంటికి వెళుతూ..ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువతలో కూడా పట్టు పెరిగింది.
కాకపోతే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి ఎంతవరకు మద్దిపాటికి సహకరిస్తారనేది తెలియడం లేదు. ముప్పిడి సపోర్ట్ ఇస్తే..మద్దిపాటి గెలుపు ఇంకా సులువు అవుతుంది. టిడిపి నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే..గోపాలాపురంలో మద్దిపాటి గెలుపు సులువే.