జగన్ ఇమేజ్…ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇదే శ్రీరామరక్ష…ఆ ఇమేజ్ ఉన్నంత కాలం వైసీపీ ఎమ్మెల్యేలకు తిరుగులేదు. గత ఎన్నికల్లో అదే ఇమేజ్ వైసీపీకి 151 ఎమ్మెల్యేలు గెలవడానికి కారణమని చెప్పొచ్చు. దాదాపు 100 వరకు ఎమ్మెల్యేలు జగన్ బొమ్మతోనే గెలిచేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు జనం..ఆ ఎమ్మెల్యేల మొహం సరిగ్గా చూశారో లేదో తెలియదు గానీ, జగన్ మొహం చూసి వైసీపీకి ఓట్లు గుద్దేశారు. దీంతో భారీ మెజారిటీలతో ఎమ్మెల్యేలుగా గెలిచేశారు.

మరి అలా 2019 ఎన్నికల్లో జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేల్లో 2024 ఎన్నికల్లో కూడా గెలవగలరా? అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు జగన్ ఇమేజ్ మరీ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన పాలన ఏంటో జనాలకు తెలుస్తోంది. కాబట్టి ఆయన బొమ్మ చూసినా ఈ సారి ఓట్లు వేయడం అంతగా ఉండకపోవచ్చు. కొంతవరకు ప్రభావం ఉంటుంది గానీ…2019 ఎన్నికల్లో ఉన్నంత మాత్రం ఉండదనే చెప్పాలి.

ఏదో ఈలోపు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి అండగా ఉంటూ సొంత ఇమేజ్ పెంచుకున్న ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ, ప్రజలకు అండగా ఉండకుండా, సొంత పనులు చక్కబెట్టుకుంటూ…ఇమేజ్ పెంచుకోకుండా జగన్ మీద ఆధారపడే ఎమ్మెల్యేలకు చుక్కలు కనబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే ఇలాంటి ఎమ్మెల్యేలు వైసీపీలో ఎక్కువమంది కనిపిస్తున్నారు. పైగా పదవుల కోసం చంద్రబాబుని తిడుతున్నారు గానీ, ప్రజలకు కావల్సిన పనులు చేసి పెట్టడం లేదు. ఇలా ప్రజలని పట్టించుకొని ఎమ్మెల్యేలని ఈ సారి జనం తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా జగన్ ఇమేజ్ కూడా తగ్గుతుంది కాబట్టి…ఈ సారి ఆ ఎమ్మెల్యేలని జగన్ కూడా కాపాడలేరని చెప్పొచ్చు.
Discussion about this post