ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై చాలా జిల్లాల్లో సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ లిస్టులో ప్రకాశం జిల్లాకు చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల నియోజకవర్గ కేంద్రమైన దర్శి నగర పంచాయతీ జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన మూడు మున్సిపాలిటీలో దర్శి కూడా ఒకటి. అప్పుడే సీఎం జగన్ ఎమ్మెల్యే వేణుగోపాల పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తోపాటు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ కూడా సహకరించలేదని వేణుగోపాల్ సీఎంకు ఫిర్యాదు చేశారు.

నియోజకవర్గంలో ఈ రెండు గ్రూపుల మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. తాజాగా మండల రెండో వైస్ ఎంపీపీ పదవుల ఎంపికలో ఓ వర్గానికి అన్యాయం జరిగిందంటూ అక్కడ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కోసం పదేళ్ల నుంచి తాము ఎంతో కష్టపడ్డామని… ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక తమను ఎంత మాత్రం పట్టించుకోవడంలేదని వారు ఎమ్మెల్యేపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ఎమ్మెల్యే మద్దిశెట్టి కి కాకుండా ఎవరికీ సీటు ఇచ్చిన గెలిపిస్తానని… ఆయనకు ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసి అయినా ఓట్లు చీల్చి వేణుగోపాల్ చిత్తు చిత్తుగా ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గం నేతలు అయితే నియోజకవర్గంలో తమ వర్గం ఓట్లు 40 వేల వరకు ఉన్నాయని… తాము వచ్చే ఎన్నికల్లో వేణుగోపాల్ కు సీటు ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.

ఏదేమైనా అటు రెడ్డి సామాజిక వర్గం నేతలతో పాటు… ఇటు సొంత పార్టీ క్యాడర్ నుంచి ఎమ్మెల్యే వేణుగోపాల్ తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. మరి దీని నుంచి ఆయన ఎలా బయట పడతారో ? చూడాలి.

Discussion about this post