వైసీపీ సర్కారు ఎన్ని ఒత్తిళ్లు చేస్తున్నా.. ఎన్ని కేసులు పెడుతున్నా.. బెదరకుండా.. ప్రజలనే నమ్ముకున్న టీడీపీ ఎమ్మెల్యేల జోరు మాత్రం అలానే కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. అయినప్పటికీ.. ప్రకాశం జిల్లాలో మాత్రం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ జోరును కొనసాగించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి.. తమ పరిధిలోని ఎంపీటీసీ స్థానాల్లో గౌరవ ప్రదమైన స్తానాలు దక్కించుకున్నారు.

వాస్తవానికి బహిష్కరణ పిలుపు ఇవ్వకపోయినట్టయితే.. ఫలితం వేరేగా ఉండేదని.. ఎమ్మెల్యేల అనుచరులు చెబుతున్నారు. ఇక, జిల్లాలో జరిగిన ఫలితాన్ని చూస్తే.. జిల్లాలో 56 మండలాలుండగా అందులో 55 మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 55 జెడ్పీటీసీ స్థానాలకు గాను 14 జెడ్పీటీసీలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 41 చోట్ల ఎన్నికలు జరిగాయి. 41 జెడ్పీటీసీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక, జిల్లాలో 784 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 68 చోట్ల ఎన్నిక నిలిచిపోయింది. 348 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఎన్నికలు జరిగిన 716 ఎంపీటీసీల్లో 628 వైసీపీ, 64 టీడీపీ, 21 ఇండిపెండెంట్‌లు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఒక్కొక్క స్థానాన్ని దక్కించుకున్నాయి.

ఇక, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపిలో ఆ పార్టీ మద్దతు దారులు పోటీ చేసి.. 9 స్థానాలు దక్కించుకున్నారు. నిజానికి పార్టీ బహిష్కరణ పిలుపుతో చాలా మంది ప్రచారం చేయలేదు. కానీ.. కొందరు మాత్రం ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేశారు. దీంతో ఇక్కడ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు. ఇక, అద్దంకిలోనూ ఇదే ఫలితం వెల్లడైంది. మొత్తం 72 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ బహిష్కరించినా.. 8 స్థానాల్లో విజయం దక్కించుకుంది.

అదేవిధంగా పరుచూరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఎమ్మెల్యే హవా కొనసాగింది. ఇక్కడ కూడా 9 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడడం విశేషం. వీటన్నింటికీ మించిన చిత్రం ఏంటంటే.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెంలో టీడీపీ ఏకంగా 15 ఎంపీటీసీలను గెలుచుకుంది.
Discussion about this post